ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కు నేడు తొలి సవాల్ ఎదురుకానుంది. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న రెండు లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్, ఉప ముఖ్యమంత్రిగా కేశవ్ ప్రసాద్ మౌర్య గతంలో పార్లమెంటు సభ్యులుగా ఉండేవారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత వారిని యూపీకి పంపించాలన్న నిర్ణయానికి అధిష్టానం రావడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ముగిసిన తర్వాత వీరిద్దరూ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
రెండుస్థానాలకు నేడు ఉప ఎన్నికలు.....
యోగి ఆదిత్యానాధ్ గోరఖ్ పూర్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. బీజేపీకి పట్టున్న నియోజకవర్గం కావడం, ఆదిత్యనాధ్ సొంత నియోజకవర్గం కావడంతో ఈ ఎన్నిక యోగికి ప్రతిష్టాత్మకంగా మారననుంది. ఈ ఎన్నికల్లో యోగి ఆదిత్యానాధ్ విస్తృతంగా ప్రచారం చేశారు. గోరఖ్ పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉపేంద్ర దత్ శుక్లా పోటీలో ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాజీనామా చేయడంతో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఫుల్ పూర్ లోక్ సభ నియోజకవర్గానికీ ఎన్నిక జరగనుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కౌశలేంద్ర సింగ్ పటేల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ ఈ రెండు లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో గత కొన్ని రోజులుగా శ్రమిస్తోంది.
ఎస్పీ, బీఎస్పీ మిలాఖత్....
అయితే వచ్చే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్స్ గా భావిస్తున్న ఈ రెండు ఉప ఎన్నికలను విపక్షాలు సీరియస్ గా తీసుకున్నాయి. నిప్పు, ఉప్పుగా ఉండే బీఎస్పీ, ఎస్పీ ఒక్కటయ్యాయి. ఇక్కడ బీజేపీని ఓడించి మోడీని మానసికంగా దెబ్బతీయాలని మాయవతి, అఖిలేష్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ అభ్యర్థులకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. వారికి అనుకూలంగా ప్రచారాన్ని కూడా చేసింది. ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో 19.49 లక్షల మంది, ఫుల్ పూర్ నియోజకవర్గంలో 19.61 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గోరఖ్ పూర్ నుంచి పది మంది, ఫుల్ పూర్ నుంచి 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం మీద ఈ ఎన్నిక యోగి ఆదిత్యానాధ్ కు సవాల్ అని చెప్పక తప్పదు.