తాజ్ మహల్ పై వివాదాన్ని తొలగించేందుకు కమలనాధుల ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. తాజ్ మహల్ వారసత్వ కట్టడమని, వారసత్వ కట్టడాలను మరిచి ఏ దేశం ముందుకు వెళ్లలేదని మోడీ పేర్కొన్నారు. అలా చేయాలనుకుంటే వారు తమ గుర్తింపును కూడా కోల్పోతారని మోడీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తాజ్ మహల్ పై ఇటీవల తరచూ వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ సర్కార్ టూరిజం బ్రోచర్లో తాజ్ మహల్ ఫొటో ను ఉంచకపోవడంపై ప్రారంభమైన వివాదం ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలతో మరింత రగడ అయింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ కూడా స్పందించారు. వీళ్లు దేశం పేరును కూడా మర్చేస్తారని వ్యంగాస్త్రాలు విసిరారు. వివాదం మరింత ముదురుతుందని భావించిన ప్రధాని మోడీ ఆయనే తాజ్ మహల్ గురించి ఒక కార్యక్రమంలో ప్రస్తావించారు. చారిత్రక వారసత్వ కట్టడాలను అందరూ గౌరవించాల్సిందే... ప్రేమించాల్సిందేనన్నారు మోడీ.
ఈ నెల 26న తాజ్ సందర్శన.....
ఇక మోడీ స్పందనతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా రియాక్ట్ అయ్యారు. తాజ్ మహల్ పై జరుగుతున్న వివాదానికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. 17వ శతాబ్దంలో నిర్మించిన కట్టడంపై తాజ్ మహల్ ను ఎవరు నిర్మించినా దానిని కట్టింది భారతీయ కూలేలని యోగి అన్నారు. భారతీయ కూలీలు తమ చెమట, నెత్తురుతో తాజ్ మహల్ ను నిర్మించారన్నారు. తాజ్ మహల్ చారిత్రాత్మక కట్టడమని, దానిని ప్రభుత్వం పరిరక్షిస్తుందని అన్నారు. పర్యాటకులు ఇబ్బంది పడకుండా తాజ్ వద్ద అన్ని సౌకర్యాలను సమకూర్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రపంచ పటంలో తాజ్ మహల్ ను అగ్రభాగాన నిలపాలన్నదే తమ ధ్యేయమని యోగి ఆదిత్యానాధ్ తెలిపారు. అంతేకాకుండా తాను ఈ నెల 26వ తేదీన తాజ్ మహల్ సందర్శనకు వెళుతున్నట్లు కూడా చెప్పారు. తాజ్ మహల్ పై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున నెటిజన్లు విమర్శలకు దిగారు. రాజకీయంగా కూడా విపక్షాలన్నీ యూపీ సర్కార్ పై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో తాజ్ సందర్శనకు వెళ్లాలని యోగి నిర్ణయించుకున్నట్లు తెలిసింది.