యోగి దెబ్బకు...ఊచలే హాయి అంటున్న....!

Update: 2018-02-17 18:29 GMT

ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు నేరగాళ్లు ఉలిక్కిపడుతున్నారు. తమంతట తాముగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. యూపీలోని పోలీస్ స్టేషన్లన్నీ నేరగాళ్ల తో నిండిపోతున్నాయి. ఎంతో కాలం నుంచి వెతుకుతున్న వారు కూడా స్టేషన్ కు వచ్చి తమను అరెస్ట్ చేసి జైల్లోకి నెట్టండి మహాప్రభో అని పోలీసు అధికారులను వేడుకుంటున్నారట. నిజం. యూపీలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. కరడు గట్టిన నేరగాళ్లు సయితం బయట కంటే జైలే పదిలమని దాక్కున్న వారు సయితం పోలో మంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోతుండటం విశేషం.

వరుస ఎన్ కౌంటర్లతో....

ఈ పరిస్థితికి ఒక కారణం ఉంది. యోగీ ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా పోలీసు అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడ శాంతి భద్రతలకు భంగం వాటిల్లినా ఊరుకోవద్దని హెచ్చరిస్తూనే ఉన్నారు. యోగి ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత యూపీలో 1200 కు పైగానే ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ విషయాన్ని యోగి ఆదిత్యానాధ్ స్వయంగా శాసనసభ సాక్షిగా తెలిపారు. నేరగాళ్లు రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోబోమని వారికి అర్థమయ్యే భాషలోనే తమ సమాధానం ఉంటుందని యోగి చెప్పారు.

నేరగాళ్తలో పోలీస్ స్టేషన్లు.....

నేరాలు చేయడం జైలుకు వెళ్లి రావడం, తిరిగి నేరాలకు పాల్పడటం ఇదీ అక్కడి క్రిమినల్స్ తంతు. దీంతో వరుస ఎన్ కౌంటర్లతో నేరగాళ్లు బెంబేలెత్తిపోతున్నారు. మామూలుగా అయితే అరెస్ట్ చేసి జైలుకు పంపితే మళ్లీ బెయిల్ పై వచ్చి నేరాలకు పాల్పడవచ్చన్నది పాత విధానం. ఇప్పుడు యోగి కొత్త పాలసీ ప్రకారం బతికుంటామో లేదో తెలియని పరిస్థితి. అందుకే మాకు బెయిల్ వద్దు.. జైలే ముద్దు అంటూ వందల సంఖ్యలో కరడు గట్టిన నేరగాళ్లు యూపీ పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. తమను ఏమీ చేయవద్దని, అందరిలాగే పనిచేసుకుని బతుకుతామని పోలీసులను బతిమలాడుకుంటున్నారట. అదండీ సంగతి... బతికుంటే బలుసాకు తిని బతకొచ్చునుకున్నారో... ఏమో... యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాధ్ ఉండేంత వరకూ తమను జైల్లోనే ఉంచమని వేడుకుంటున్నారట.

Similar News