నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్. ఆయన ఏం చేసినా సంచలనమే. ఆయన ఏంమాట్లాడినా సెన్సేషనే. తాజాగా ఆయన ఎన్ కౌంటర్ల మీద చేసిన వ్యాఖ్యలు సంచలమే కలిగించాయి. యోగీ ఆదిత్యనాధ్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,142 ఎన్ కౌంటర్లు జరిగాయి. 38 మంది నేరగాళ్లు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఈ వరుస ఎన్ కౌంటర్లు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. చివరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా యోగీ ఆదిత్యానాధ్ ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది.
తూటాతోనే సమాధానం....
అయినా యోగీ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిని ఉపేక్షించబోమని తెగేసిచెప్పారు. అంతేకాదు ఆయన మరోసంచలన వ్యాఖ్య చేశారు. తుపాకీకి తుపాకీతోనే సమాధానమివ్వాలని అభిప్రాయపడ్డారు. తుపాకీ చేతిలో ఉంది కదా అని నేరాలకు పాల్పడితే ఊరుకునేది లేదని వారికి తూటాతోనే బదులివ్వాలని యోగి ఆదిత్యానాధ్ ఒక బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఎవరేమనుకున్నా సరే ఈ విషయంలో వెనక్కు తగ్గవద్దని యోగీ ఆదిత్యానాధ్ అధికారులకు సూచించారు.
విపక్షాల అభ్యంతరం....
ప్రజల బాగోగులు చూడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అయితే ఈ ఎన్ కౌంటర్లలో సామాన్యుల బలవుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ ఫేక్ ఎన్ కౌంటర్లని పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం చేస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఈ ఎన్ కౌంటర్ల విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. అయితే యోగి మాత్రం వీటన్నింటినీ పట్టించుకోవద్దని అధికారులకు సూచించడం విశేషం. నేరగాళ్లను వదిలిపెట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్గించలేమన్నది ఆయన అభిప్రాయంగా ఉంది. మొత్తం మీద యోగి వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం కల్గించాయి.