యుద్ధానికి అస్త్ర శస్త్రాలు సిద్ధమా

Update: 2018-03-27 04:30 GMT

ఈరోజు లోక్ సభలో విపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటారా? చర్చ చేపడతారా? రెండు పార్టీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అందులో ఒకటైన టీఆర్ఎస్ ఆందోళనను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. అన్నాడీఎంకే ఒక్కటే వెల్ లోకి వెళ్లే అవకాశముంది. దీంతో అన్నాడీఎంకే సభ్యులను సముదాయించి అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టనున్నారని హస్తినలో జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీనికి తోడు అన్ని పార్టీలూ చర్చకు సిద్ధమయి పోతున్నాయి.

చేపట్టక తప్పని పరిస్థితి.....

ఇప్పటికే వరుసగా అవిశ్వాస తీర్మానాలు ఇస్తున్నప్పటికీ సభను వాయిదా వేసుకుంటూ వెళుతున్నారన్న అపప్రథను బీజేపీ మూట కట్టుకుంది. నిన్న మొన్నటి వరకూ టీడీపీ, వైసీపీలే అవిశ్వాస తీర్మానాలను ఇచ్చేవి. అయితే వీటికి తోడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఎంలు కూడా జత కలవడంతో అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టక తప్పని పరిస్థితి కేంద్రానిది. లేకుంటే భయపడి వెనక్కు వెళ్లిపోయారన్న విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీంతో ఈరోజు సభలో అవిశ్వాస తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పీకర్ ప్రకటిస్తారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే చర్చ ఈరోజు జరుగుతుందా? స్పీకర్ అందుకు సమయం కేటాయిస్తారా? అన్నది మరి కాసేపట్లో తేలనుంది.

దుమ్ము దులేపాస్తామంటున్న బీజేపీ....

అయితే అవిశ్వాసంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. ఇందుకోసం ఆరుగురు మంత్రులను సిద్ధం చేసింది. వారు ఏపీకి చేసిన న్యాయంపై సవివరంగా సభ ముందుంచేందుకు కసరత్తులు పూర్తి చేశారు. అమిత్ షా రాసిన లేఖలోని సారాంశాలు మాత్రమే కాకుండా పూర్తి ఆధారాలతో సభ ముందుంచాలని బీజేపీ భావిస్తోంది. తెలుగుదేశం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అనవసర రాద్ధాంతం చేస్తోందని, తాము ఏపీకి అన్నివిధాలుగా సాయం చేస్తామని, చేస్తూనే ఉంటామని సభలో వివరించనుంది.

ఆ ఇద్దరి చేత మాట్లాడించాలని....

ఇక టీడీపీ కూడా యుద్ధానికి రెడీ అయింది. ఇప్పటికే అమిత్ షా, బీజేపీ, మోడీల మీద ఒంటికాలి మీద లేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏపీ సమస్యను జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు రెడీ అయింది. ఎవరెవరు మాట్లాడాలో కూడా చంద్రబాబు నిర్ణయించారు. సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడులు మాట్లాడతారని చంద్రబాబు నిర్ణయించారు. వీరికి అవసరమైన ముడిసరుకును కూడా అందజేశారు. ఇక వైసీపీ కూడా అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డిల చేత మాట్లాడించాలని నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తం మీద ఈరోజు, రేపట్లో సభలో అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశముందని బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News