యుద్ధం మొదలయింది...!

Update: 2017-11-24 16:30 GMT

గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కనుంది. గుజరాత్ ను కైవసం చేసుకునేందుకు రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సొంత రాష్ట్రం కావడంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సొంత రాష్ట్రంలోనే మోడీ పార్టీని ఓడించి వచ్చే సాధారణ ఎన్నికలకు బలమైన సంకేతాలు పంపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇటీవల జరిపిన సర్వేల ఫలితాల్లో బీజేపీకి కొంత అనుకూల వాతావరణం ఉందని తేలింది. అయినా మ్యాజిక్ ఫిగర్ చేరుకునేందుకు బీజేపీ శ్రమించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇరవై ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఏర్పడే వ్యతిరేకతను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మోడీ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 27, 29వ తేదీల్లో మోడీ గుజరాత్ లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మోడీ ఈ రెండు రోజుల్లో ఎనిమిది సభల్లో పాల్గొన్నారు.

రాహుల్, మోడీ సుడిగాలి పర్యటనలు...

డిసెంబర్ 9వ తేదీన గుజరాత్ తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 14వ తేదీన చివరిదశ ఎన్నికలు జరగనున్నాయి. చివరి దశలో 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే గుజరాత్ లోకేంద్రమంత్రులు పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇటీవలే మూడు రోజులు పర్యటించిన రాహుల్ మరోసారి ఈరోజు, రేపు గుజరాత్ లో పర్యటిస్తున్నారు. వీరి పర్యటన రెండు పార్టీలో నెలకొన్న అసంతృప్తులు తొలగించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ పర్యటించనున్న సౌరాష్ట్ర లో కాంగ్రెస్ బలం పుంజుకుంది. ఈ విషయం సర్వేల్లో స్పష్టం కావడంతో మోడీ అక్కడే ఎక్కువగా దృష్టిపెట్టారు. మరోవైపు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ నెల26వ తేదీన ప్రసంగించనున్నారు. ఇందుకోసం బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News