యుద్ధం తప్పేట్లు లేదే....!

Update: 2018-02-13 07:30 GMT

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీల మద్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఎవరి లెక్కలు వారి కున్నాయి. అంతా ఇచ్చేశామంటారు బీజేపీ నేతలు. ఏమీ ఇవ్వలేదు పొమ్మంటున్నారు టీడీపీ నేతలు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎంతో చేసిందని చెప్పారు. ఏపీ రెవెన్యూ లోటు 4,600 కోట్లు కాగా ఏపీ సర్కార్ మాత్రం దానిని 16వేల కోట్ల రూపాయలని చెబుతుందన్నారు. అయితే ఈ 16వేల కోట్లలో రుణమాఫీ, సంక్షేమ పథకాలను కూడా కలిపిందని చెప్పారు. పది ఏళ్లలో విభజన హామీలను పూర్తి చేయాల్సి ఉంటే ఐదేళ్లలోనే చాలా హామీలు నెరవేర్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికే 16 యూనివర్సిటీలను మంజూరు చేశామన్నారు.

మిత్రపక్షంగా ఉండి.....

వామపక్షాలు, వైసీపీ కలిసి బంద్ చేస్తే మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అందులో ఎలా భాగస్వామ్యం అయిందో చెప్పాలని సోము వీర్రాజు ప్రశ్నించారు. దుగరాజు పట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు కమిటీ నివేదికలు ప్రతిబంధకంగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలన్నారు. చంద్రన్న బీమా, తోఫాలన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే అమలు చేయడం వాస్తవం కాదా అని సోము వీర్రాజు నిలదీశారు. హామీల అమలుకు 2022 వరకూ సమయం ఉందన్నారు సోము వీర్రాజు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చట్టంలో నిర్దేశిత గడువులేకపోయినా కేంద్ర ప్రభుత్వం 2019 లోగా పూర్తి చేయడానికి పూనుకుందని గుర్తు చేస్తున్నారు.

మార్చి 5 డెడ్ లైన్......

మరోవైపు టీడీపీ మాత్రం మార్చి 5వ తేదీ వరకూ డెడ్ లైన్ విధించింది. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన నిధులు కేవలం 20 వేల కోట్లు మాత్రమేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చింది పదివేల కోట్లు మాత్రమేనని తెలిపారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన జాబితా ప్రకారం చూసుకున్నా రాష్ట్రానికి 28 వేల కోట్లు రావాల్సి ఉండగా పది వేల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. విభజన హామీలు అమలు చేయకుంటే యుద్ధం తప్పదని టీడీపీ నేతలు హెచ్చరించారు. తమ సహనానికి కూడా హద్దు ఉందని, ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ పొత్తుపై తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మొత్తం మీద బీజేపీ, టీడపీ లెక్కలతో రెండు పార్టీల మధ్య గ్యాప్ బాగా పెరిగిందంటున్నారు విశ్లేషకులు.

Similar News