యడ్యూరప్ప ధీమాగా ఉన్నారు. శ్రీరాములు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. శాసనసభలో ఎమ్మెల్యేలతో పలకరింపులు. మరోవైపు తమ శాసనసభ్యులను ఎవరెవరు కలుస్తున్నారని జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల నిఘా. ఇదీ కర్ణాటక శాసనసభలో పరిస్థితి. కర్ణాటక శాసనసభ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ప్రొటెం స్పీకర్ బొపయ్య ఆధ్వర్యంలోనే బలపరీక్ష జరగుతుందని తేల్చి చెప్పింది. బొపయ్య నియామకానికి వ్యతిరేకంగా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. అయితే డివిజన్ ఓటింగ్ కు ఆదేశిస్తామని కోర్టు చెప్పింది.
రంగంలోకి దిగిన మఠాధిపతులు....
మరి సుప్రీంకోర్టు ఆదేశాలు బొపయ్యకు ఎప్పుడు చేరతాయి.ఆయన ఆదేశాలు అందితేనే కదా పాటించేది...అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. ఇది పక్కన పెడితే యడ్యూరప్ప కోసం మఠాధిపతులు రంగంలోకి దిగారన్న ప్రచారం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. ముఖ్యంగా లింగాయత్ లకు చెందిన మఠాధిపతులు కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న ఆ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ లోని కొందరు ఎమ్మెల్యేలు మఠాధిపతుల ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తారన్న ఆశతో బీజేపీ ఉంది.
కాంగ్రెస్ లో కలవరం.....
గత కొన్ని రోజులుగా అదృశ్యమైన విజయనగర కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆనంద సింగ్ ప్రత్యక్షమయ్యారు. తాను గెలిచిన పార్టీ వైపేనే ఉంటానని చెప్పడం కాంగ్రెస్ కు కొంత ఊరట కల్గించే అంశం. అయితే ఎక్కడో ఏదో అనుమానం. బీజేపీ ఇప్పటికే తమ సభ్యులను లోపాయికారిగా సంప్రదించి, ప్రలోభాలకు గురిచేసిందన్నది కాంగ్రెస్ పార్టీకి నిద్రపట్టనివ్వడం లేదు. బీజేపీకి బలపరీక్షలో గెలవాలంటే ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. అయితే కొందరు సభ్యులు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సభ నుంచి బయటకు వెళ్లాలన్న వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ పసిగట్టి ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.
కుమారస్వామిలో అనుమానాలు.....
కుమారస్వామి వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. తమ జనతాదళ్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలందరమూ కలసి కట్టుగా ఉన్నామని, అయితే కాంగ్రెస్ సభ్యులతో బీజేపీ బేరసారాలాడినట్లు తమక అనుమానంగా ఉందన్నారు కుమారస్వామి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను కూడా ఆందోళనలోకి నెట్టాయి. ఈరెండు రోజులూ ఒక్కొక్క సభ్యుడికి ఒక్క ఇన్ ఛార్జిని నియమించింది. సభ్యులు ఎవరూ చేయిదాటిపోకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. మరి సభలో ఏంజరుగుతోందన్న టెన్షన్ మాత్రం కాంగ్రెస్ నేతల కళ్లల్లో కన్పిస్తూనే ఉంది. మొత్తం మీద మఠాధిపతుల ఆదేశాలు వర్క్ అవుట్ అయితే యడ్డీ గెలుపు ఖాయమేనంటున్నారు.