మౌనముని ప్రసంగాలు దంచేస్తున్నారు ....!

Update: 2017-12-03 16:30 GMT

దేశ ప్రధానులుగా సమర్ధంగా రాణించిన వారిలో పివి నరసింహ రావు, మన్మోహన్ సింగ్ లకు ఉమ్మడిగా ఒక పేరు ముద్ర పడింది. వారిద్దరూ మౌన మునులుగానే పిలవబడే వారు. ఇందులో మన్మోహన్ కి ప్రజలు ఎక్కువ మార్కులు వేస్తారు ప్రజలు. ఎందుకంటే ఆయన మరీ అరుదుగా మాట్లాడటమే కనిపించేది. అలాంటి మన్మోహన్ గుజరాత్ ఎన్నికలు మొదలైన నాటినుంచి బిజెపి సర్కార్ పై ఊహించని స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అది కూడా తన నోటికి పూర్తి స్థాయిలో పని కల్పిస్తూ ఔరా అని ఆశ్చర్య పరుస్తున్నారు. ప్రధాని కాకముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా కూడా వున్న మన్మోహన్ నోట్ల రద్దు, జీఎస్టీ పై చేస్తున్న ప్రసంగాలు గుజరాతీయులనే కాదు యావత్తు దేశవాసులను ఆకర్షిస్తున్నాయి.

బిజెపి నిర్ణయాలతో చైనాకే లాభమంటున్న మన్మోహన్ ...

ఆర్ధిక శాస్త్ర నిపుణుడు అయిన మాజీ ప్రధాని మన్మోహన్ కొత్త విశ్లేషణ చేశారు. హోరా హోరీగా సాగుతున్న గుజరాత్ ఎన్నికల్లో పలు సభల్లో మాట్లాడుతున్న మాజీ ప్రధాని నోట్ల రద్దు, జీఎస్టీ అమలు వల్ల మన పొరుగు దేశం చైనా లబ్ది పొందిందన్నారు. భారత్ లో పెద్ద నోట్ల రద్దు ఫలితంగా ముందుగా వందమందికి పైగా ప్రజలు చనిపోయారని ఆరోపించారు. బిజెపి అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ఆర్ధిక వ్యవస్థను తిరోగమనం వైపు నడిపిస్తున్నాయని విమర్శించారు. ఇలా పలు కీలక అంశాలపై గణాంకాలతో సహా మన్మోహన్ గుజరాత్ సభల్లో చేస్తున్న ప్రసంగాలు బిజెపి శ్రేణులకు చెమటలు పట్టించడం విశేషం.

Similar News