తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం 5 గంటలకు వీరి భేటీ జరిగింది. నోట్ల రద్దు వలన దేశవ్యాప్తంగా ప్రజలకు ఎదురౌతున్న కష్టాలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు మొత్తం స్తంభించిపోవడం వలన రాష్ట్రాలకు అనూహ్యంగా వాటిల్లిన నష్టం, ఇలాంటి సందర్భాల్లో కేంద్రం రాష్ట్రాలకు అందించవలసిన చేయూత ఇత్యాది అంశాల గురించి కేసీఆర్ ప్రధానంగా మోదీతో చర్చించబోతున్నారు.
అలాగే ప్రజలు ఇళ్లలో నగదు రూపంలో దాచుకున్న సొమ్ము, మధ్య తరగతి, సామాన్యుల విషయంలో కూడా.. దాన్ని నల్లధనం అని పిలవడాన్ని కేసీఆర్ తప్పుపడుతున్నారు. 2.5 లక్షల కంటె పరిమితి పెంచి, దాన్ని నల్లధనంగా కాకుండా అనౌకౌంటెడ్ మనీగా డిపాజిట్లు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరబోతున్నారు. ఇదే జరిగితే.. చాలా మంది మధ్య తరగతి వారికి పెద్ద లాభం అవుతుందనడంలో సందేహం లేదు.
నోట్ల రద్దు పర్యవసానం అంశాలతో పాటు ఇంకా అనేక విషయాలను కేసీఆర్ చర్చించబోతున్నట్లు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ తాను వెంట తీసుకు వచ్చిన అన్ని రకాల ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా ప్రధానికి సమర్పించారు. రాష్ట్రం ఎంత ఆదాయం కోల్పోయింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఒత్తిడిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ప్రధానికి నివేదించారు. నోట్ల రద్దు తర్వాత.. ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేరుగా ప్రధానిని కలసి సమస్యలను నివేదించడం జరగలేదు, ఆ ఘనత కేసీఆర్ ఒక్కరే చేసినట్లు తెలుస్తోంది..