మోత్కుపల్లి బయటపడ్డారు

Update: 2018-03-02 09:30 GMT

మోత్కుపల్లి నరసింహులు తన మాటలను వెనక్కు తీసుకున్నారు. టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలన్న మోత్కుపల్లి వ్యాఖ్యలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల పాటు హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు నిర్వహించిన సమావేశాలకు మోత్కుపల్లికి ఆహ్వానం అందలేదు. ఆయన సమావేశాలకు హాజరు కాలేదు. సమావేశాల్లో వచ్చే ఎన్నికల్లో పొత్తు టీఆర్ఎస్ తో ఉంటుందన్న సంకేతాలను ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తాను అన్నదాంట్లో్ తప్పేముందని ప్రశ్నించారు.

రేవంత్ ను ఆరోజే సస్పెండ్ చేసి ఉంటే....

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు వదిలేయడం వల్లనే ఈపరిస్థితి తలెత్తిందన్నారు. చంద్రబాబు కొందరు అనర్హులకు పార్టీ పదవులను కట్టబెట్టడం వల్లనే పార్టీ పరిస్థితి ఈ రోజు ఇంతగా దిగజారిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ పదవులను అనుభవించి నట్టేట ముంచి వెళ్లిపోయారన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నప్పుడే రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసి ఉంటే పార్టీకి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. అంకిత భావం లేని వారికి నాయకత్వం ఇచ్చినందునే ఇంత సంక్షోభాన్ని తెలంగాణలో టీడీపీ ఎదుర్కొంటుందన్నారు.

వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నా....

తాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచే తెలుగుదేశం పార్టీలో ఉన్నానన్నారు. దివంగత ఎన్టీఆర్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్నారు. ఎన్టీఆర్ ప్రాంతాలకు అతీతమైన నాయకుడన్నారు. చంద్రబాబు క్లిష్టసమయంలో కూడా తాను అండగా నిలిచానని చెప్పారు. చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి తాను లేకుండా సమావేశాలను నిర్వహించడం బాధకల్గించిందన్న మోత్కుపల్లి తాను అన్న వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలగించి ఉంటే క్షమించాలని వేడుకున్నారు. సిద్ధాంత పరంగా తెలంగాణలో టీడీపీ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే అది కాంగ్రెస్ తో కాదని టీఆర్ఎస్ తోనేనని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ లో ఎన్టీఆర్ ను అభిమానించే నేతలు ఎందరో ఉన్నారని, అందులో కేసీఆర్ కూడా ఒక్కరని గుర్తు చేశారు. మొత్తం మీద మోత్కుపల్లి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని తిరిగి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించాలని తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది.

Similar News