ప్రధాని మోడీలో మార్పు వచ్చిందా? గుజరాత్ ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చేసిన సర్వేల ఫలితంగా ప్రధాని మోడీలో ఛేంజ్ కన్పిస్తుందంటున్నారు. గుజరాత్ ఎన్నికల్లో మిషన్ 150గా ప్రచారంలోకి దూసుకెళ్లినా... అక్కడ సొంత బలం వంద అంకెను చేరుకోలేదు. దీంతో మోడీకి కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నట్లు అర్ధమయింది. ఇక మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ వ్యాప్తంగా చేసిన సర్వేలో సయితం ఈసారి బీజేపీకి లోక్ సభలో 60 సీట్లు తగ్గుతాయని తేలింది. దీంతో మోడీకి మిత్రపక్షాల అవసరం కన్పిస్తోంది. మోడీ ఈ నాలుగేళ్లుగా మిత్రపక్షాలను అస్సలు పట్టించుకోలేదు. కనీసం మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలో వారితో చర్చించనూ లేదు. లోక్ సభలో ఫుల్ మెజారిటీ ఉండటంతో ఇప్పటి వరకూ మిత్రులను మోడీ దూరం పెట్టారన్న వాదన ఉంది.
ఒంటరిగా రావాలంటే....
2019 ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి రావాలని మోడీ, అమిత్ షాలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. వరుసగా ఎన్నిక జరిగిన ప్రతి రాష్ట్రాన్ని కమలం ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో కన్పించిన ఊపు తర్వాత తగ్గిపోయింది. పంజాబ్ లో అపజయం పాలయింది. గోవాలో ఓడి గెలిచింది.ఇక గుజరాత్ సంగతి తెలిసిందే. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా ఎన్నికల్లో స్పష్టమైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి రాకపోయినా మిత్రపక్షాల అవసరం బీజేపీకి ఉంటుంది. అనుకోని పరిస్థితులు ఎదురైతే వారి మద్దతుతోనే సర్కార్ ను ఏర్పాటుచేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పటికే మిత్రపక్షమైన శివసేన దాదాపు దూరమైందనే చెప్పుకోవాలి. శివసేన తిరిగి కమలంతో చేయి కలుపుతుందన్నది అనుమానమే.
మిత్రులను మంచి చేసుకునే పనిలో.....
ఈ నేపథ్యంలో మిత్రపక్షాలను మంచి చేసుకునే పనిలో పడ్డారు ప్రధాని మోడీ. దక్షిణాదిన మిత్రపైక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏడాది తర్వాత మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఏడాది నుంచి పీఎంఓ చుట్టూ తిరుగుతున్నా మోడీ అపాయింట్ మెంట్ దక్కలేదు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటోంది ఏపీ. విభజన హామీల అమలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. కేంద్రమంత్రుల వద్దకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక లోటును భర్తీ చేయాలని ఏపీ సర్కార్ ఎప్పటి నుంచో కోరుతుంది. కాని నిధులు మాత్రం నామమాత్రంగానే విడుదలవుతున్నాయి.
ఎన్నో సమస్యలు..ఇదే తరుణం...
ఇక రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా విడుదల కావడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు కొర్రీలు వేస్తూనే ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తికాకుంటే చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది తప్పదు. అలాగే ఉత్తరాంధ్రకు ప్రధాన హామీ అయిన విశాఖ రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం పట్టించుకోవడం మానేసింది. ఈ నేపథ్యంలో మోడీ చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. వచ్చేది ఎన్నికల కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నింటినీ రాబట్టుకోవాల్సిన సమయం ఇదేనన్నది చంద్రబాబు వ్యూహం. మోడీతో భేటీ తర్వాత విభజన హామీలు నెరవేరతాయా? లేదా నాలుగేళ్ల నుంచి చెబుతున్న మాటలనే తిరిగి వల్లె వేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.