భావోద్వేగం!! బహుశ ఎక్కడో సినిమాల్లో విన్న మాటగా అనిపించేది! కానీ, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ వారి ఆలోచనా ధురీణత్వంతో యావత్ భారత దేశానికీ ఇప్పుడు ఈ మాట కరతలామలకం! ఇకపై భావోద్వేగం అనే పదం ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితిలో వినిపించినా సాక్షాత్తూ.. శ్రీకృష్ణావతారంలో లీలలెరిగిన జగన్మోహనాకృతిలో ప్రధాని నరేంద్ర మోడీ సాక్షాత్కరించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచి తీరాలని పట్టుబట్టిన ప్రధాని నరేంద్ర మోడీ అందుకు ఉపయోగించిన ఆయుధం ఏకే 47 కానేకాదు. ఇంద్రుడి వజ్రాయుధమూ కాదు. కేవలం భావోద్వేగం!! కత్తికన్నా.. పదునైన ప్రజల భావోద్వేగాలను ఆయన రెచ్చగొట్టి.. రెచ్చిపోయేలా ఓట్లు వేయించుకున్నారు.
భావోద్వేగంతోనే...
ఫలితంగా ఇక, ఇప్పటితో గుజరాత్ ప్రజలకు బీజేపీ పాలనపై మొహం మొత్తిందని, ప్రధాని ప్రవేశ పెట్టిన జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావంపై గుజరాతీలు గుర్రుగా ఉన్నారని ఇదంతా గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల రూపంలో బుధ్ది చెబుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అందరూ అనుకున్నంత వీజీ మనిషైతే.. ప్రధాని ఎలా అవుతారు? అందుకే మోడీ తనదైన భావోద్వేగం అనే ఒకే ఒక అస్త్రాన్ని గుజరాతీలపై ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా గుజరాత్ ప్రజలు యూటర్న్ తీసుకున్నారు. మోడీ.. 'నేను, మనం' అని అనడం, బీసీనని చెప్పుకోవడం, గత ప్రధాని మాదిరిగా తాను మౌనంగా ఉండలేనని చెప్పుకొచ్చారు. దీంతో గుజరాతీలు అప్పటి వరకు కాంగ్రెస్ అంటూ భజన చేసినా చివరిని ముషంలో మాత్రం బీజేపీ పక్షాన చేరిపోయారు.
ఇప్పుడిప్పుడే ఇక్కడ...
ఫలితంగా కొన్ని స్వల్ప సీట్లలో మినహా గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే, ఇదే భావోద్వేగం .. ప్రజల్లో రగిలితే.. మోడీ పరిస్థితి ఏమిటి? బీజేపీ పరిస్థితి ఏంటి? అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. ముఖ్యంగా 2019లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిని బీజేపీ ప్రతిస్టాత్మకంగా తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లోఒక్క కర్ణాటకలో మినహా బీజేపీ ఎక్కడా బలంగా లేదు. అయితే, ఏపీలోను, తోలంగాణలోనూ బీజేపీని పరుగులు పెట్టించాలని, కేడర్‌ను బలోపేతం చేయాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే, ఇప్పుడిప్పుడే ప్రజల్లో భావోద్వాగాలు బలపడి పోతున్నాయి.
విసిగెత్తిపోయి ఉన్న ఆంధ్రులు...
ఇన్నాళ్లూ కేంద్రం వస్తుంది. తమకు ఏదో చేస్తుంది. తమ భవిష్యత్తు బాగుంటుందని భావించిన ఏపీ వాసులు కేంద్రం సహా ప్రధాని నరేంద్ర మోడీ వైఖరితో విసుగెత్తిపోయి ఉన్నారు. ప్రత్యేక హోదా లేదు, పోలవరానికి నిధులు ఇస్తారో లేదో తెలీదు, రాజధాని నిర్మాణాన్ని పట్టించుకుంటారో లేదో అనే ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ భావోద్వేగాలకు ఓటు అనే ఆయుధాన్ని అందిస్తే.. ఏమవుతుందో నరేంద్ర మోడీ ఊహించుకోవాలి. గత ఎన్నికల ప్రచారంలో మోడీ ఏపీకి వచ్చి ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిల్లో ఒక్కటి కూడా నెరవేరని పరిస్థితి. ఏపీలో సామాన్య జనాల్లోకి కూడా మోడీ, కేంద్ర ప్రభుత్వం ఎంతో మోసం చేసిందన్న భావన జనాల్లోకి వెళ్లిపోయింది. మోడీ ఏపీ ప్రజల భావోద్వేగాల ఆగ్రహానికి గురి కాకతప్పదన్న విశ్లేషణలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. సో.. అన్ని చోట్లా ఒకే ఎత్తు పారడం రాజకీయాల్లో సాధ్యమయ్యే పనికాదు. సో.. మోడీ భావోద్వేగం గుజరాత్‌లో గెలిచినా.. ప్రజల భావోద్వేగం ఏపీలో బీజేపీని సమాధి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.