మోడీకి సొంత నియోజకవర్గంలోనే భంగపాటు...!

Update: 2017-11-05 17:30 GMT

ప్రధాని మోడీ ఇమేజ్ తగ్గిపోతుందా? ఆయన సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలిందా? అవును మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలోనే మోడీకి షాక్ ఇచ్చారు. బీజేపీ కూడా ఇది ఊహించలేదు. సాధారణంగా విద్యార్థి సంఘ ఎన్నికలను కూడా ఇక్కడ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. విద్యార్థి సంఘ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికల తరహాలో జరుగుతాయి. విద్యార్థి సంఘాల ఎన్నికలకు ఆర్థికంగా కూడా అన్ని పార్టీల నేతలు సహకరిస్తారు. సాధారణ ఎన్నికల్లో గట్టెక్కాలంటే విద్యార్థి సంఘాల ఎన్నికల్లో గెలవాలని ప్రతి పార్టీ భావిస్తుంటుంది. అయితే వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్ యూనివర్సిటీ ఎన్నికల్లో మోడీ పార్టీ ఘోర పరాజయం పాలయింది.

ఏబీవీపికి చుక్కెదురు.....

బీజేపీ విద్యార్థి అనుబంధ విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. ఏబీవీపీ తరుపున వాల్మీకి ఉపాథ్యాయ పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి టిక్కెట్ లభించకపోవడంతో రాహుల్ దుబే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన రాహుల్ దుబే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవి, లైబ్రరీ కార్యదర్శి పదవులను సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ లు గెలుచుకున్నాయి. ఏబీవీపీ కి గతంలో ఉన్న ఒక్క పదవీ ఈ ఎన్నికల్లో ఊడిపోయింది. అయితే ఒక్క వారణాసిలోనే కాదు యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అనేక ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విభాగమైన ఏబీవీపీకి భంగపాటు తప్పలేదు.

Similar News