మోడీకి మైండ్ బ్లాంక్ ? రాహుల్ కు నగుబాటు?

Update: 2017-12-14 00:30 GMT

నేడు గుజరాత్ లో ఆఖరిపోరాటం. చివరి దశ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. చివరి దశలో మొత్తం 93 నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య గుజరాత్ ఎన్నికల ప్రచారం ఆర్భాటంగా ముగిసింది. ప్రధాని నరేంద్రమోడీ, త్వరలో పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు. రెండో దశ బీజేపీకి కీలకంగా మారనుంది. ముఖ్యంగా అహ్మదాబాద్, గాంధీనగర్, బనస్కాంత ప్రాంతాలు బీజేపీకి పట్టున్న ప్రాంతాలు. ఈ దశలో తమకు సునాయాసంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని బీజేపీ భావిస్తోంది. అయితే సైలెంట్ గా ఉన్న గుజరాతీ ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గుచూపుతారోనన్న ఉత్కంఠ కమలనాధులకు కంటిమీద కునుకులేకుండాచేస్తుంది. మొదటి దశ ఎన్నికల్లో బీజేపీకి అనుకున్న సీట్లు రావన్నది ఆ పార్టీ నేతలే అక్కడక్కడా చెబుతున్నారు. దీంతో చివరి దశమీదనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. కాగా చివరి దశ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఆశ్చర్యపోయే ఫలితాలు...

మరోవైపు యువనేత రాహుల్ గాంధీ బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. గుజరాత్ ఖచ్చితంగా షాక్ ఇచ్చే ఫలితాలు రానున్నాయని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ మతి పోయేలా ఫలితాలు రానున్నాయని రాహుల్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పడం విశేషం. ఈసారి ప్రచారంలోనూ తాము ముందున్నామని, బీజేపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదన్నారు రాహుల్ గాంధీ. గుజరాత్ ఫలితాలతో మోడీ తానేంటో తెలుస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మీద లేనిపోని అభాండాలు వేస్తే ఓట్లు రాలుతాయని మోడీ భావించారని, అది బూమ్ రాంగ్ కావడం ఖాయమని ఆయన అన్నారు.

ఆ ముగ్గురి భవిష్యత్....

ఇక గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ గెలుపోటములను పక్కన పెడితే... ఆ ముగ్గురి భవిష్యత్ ను నిర్ణయిస్తాయి. ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈ ముగ్గురి కథేంటో నేడు తేలిపోనుంది. గుజరాత్ ఎన్నికల్లో కీలకంగా మారిన ఈ ముగ్గురూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. గుజరాత్ లో ఎవరుకలిసినా వీరి గురించే చర్చ. హార్థిక్ పటేల్, అల్ఫేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మెవాని. ఈ ముగ్గురూ వేర్వేరు సామాజిక వర్గాల నుంచి వచ్చి ఉద్యమాల బాట పట్టారు. తమ సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటూనిన్నటి వరకూ పోడారు. వీరిలో అల్ఫేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మెవానీలు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. హార్థిక్ పటేల్ మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురు నేతలూ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. వీరంతా బీజేపీకి వ్యతిరేకులే. కాంగ్రెస్ ను సమర్థిస్తూ విస్తృతంగా ప్రచారం చేశారు. మరి కాంగ్రెస్ గెలిస్తే వీరు ఉద్యమనేత నుంచి రాజకీయనేతగా ఎదుగుతారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే వీరికి భంగపాటు తప్పదంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద ఈ నెల 18వ తేదీన జరగనున్న కౌంటింగ్ లో మోడీకి మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయా? రాహుల్ మరోసారి నవ్వుల పాలు కాక తప్పదా? అన్నది తేలిపోనుంది.

Similar News