రాజస్థాన్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు అద్దం పట్టినట్లేనన్నది విపక్షాల విమర్శ. వచ్చే ఎన్నకల్లో తమదే విజయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మోడీ నిర్ణయాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నదానికి రాజస్థాన్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో మిత్రపక్షంగా ఉంటూ ఇటీవలే వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరి పోరుకు దిగుతామన్న శివసేన కూడా మోడీ, అమిత్ షాలపై విరుచుకుపడుతోంది.
రాజస్థాన్ ఎన్నికలు ఇంటర్వెల్ మాత్రమే....
రాజస్థాన్ ఎన్నికలు ఇంటర్వెల్ మాత్రమేనని, అసలైన సినిమా ముందుందని శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రావత్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అసలు సంగతి బయటపడుతుందన్నారు. గుజరాత్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, రాజస్థాన్ ఎన్నికలు ఇంటర్వెల్ అని, అసలు సినిమా వచ్చే ఎన్నికల్లో చూడబోతున్నామని సంజయ్ రావత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోక్ సభ ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని సంజయ్ రావత్ మరోసారి స్పష్టం చేశారు. బీజేపీతో కలిసే ప్రసక్తి లేదని చెప్పారు. బడ్జెట్ కూడా కాగితాలకే హామీలని..అవి క్షేత్రస్థాయిలో అమలు కావని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీని నడిపించే మోడీ, అమిత్ షాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.