మోడీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా?

Update: 2018-03-14 17:30 GMT

లోక్ సభ స్థానాల ఉప ఎన్నికల్లో వరుసగా బీజేపీకి అపజయం ఎదురవుతోంది. మొన్న రాజస్థాన్ నేడు ఉత్తరప్రదేశ్. ఇది దేనికి సంకేతం? లోక్ సభ ఎన్నికలంటే సహజంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తాయి. అంటే మోడీపై మొహం మొత్తిందా? దీనికి కారణాలేంటి? ఇదే కమలనాధుల్లో జరుగుతున్న అంతర్మధనం. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన గోరఖ్ పూర్, ఫుల్ పూర్ లోక్ సభ స్థానాలతో పాటు బీహార్ లోని అరారియా లోక్ సభ స్థానం కూడా కమలం పార్టీ కోల్పోయింది. నోట్లరద్దు, జీఎస్టీ వంటివి తమ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపలేదని ఇప్పటి వరకూ కమలనాధులు గొప్పలు చెప్పుకుంటూ వచ్చారు. కానిఈ ఫలితాలతో తప్పని తేలింది. లోక్ సభ స్థానాల్లో ఓటమి అంటే అది ఖచ్చితంగా మోడీ ఖాతాలో వేయాల్సిందే.

మోడీపై నమ్మకంతోనే.....

అయితే ఇప్పుడు సీన్ మారింది. అలా చెప్పుకోలేని పరిస్థితి. మోడీ మీద అవినీతి మచ్చ లేదు. సంసార జంఝాటం లేకపోవచ్చు. అయినా ఆయన మీద నమ్మకంతోనే గత ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చి పెట్టారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడానికి మోడీ చరిష్మా కారణమని చెప్పక తప్పదు. గుజరాత్ లో మోడీ సాధించిన విజయాలు ఆయనను ప్రధాని చేశాయి. మోడీ చరిష్మాతో పాటు యూపీఏలో జరిగిన కుంభకోణాలు, అసమర్థ పాలనతో పదేళ్లు విసిగిపోయిన ప్రజలు కమలానికే జై కొట్టారు.

పాలనతో ఒరిగిందేమిటి?

కాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారన్నది ఆయన మిత్రపక్షాల నుంచి వస్తున్న విమర్శలు. మోడీ, అమిత్ షాల ద్వయం తాము అనుకున్నదే చేయాలనుకునే రకం. అవతలి వారి నుంచి సలహాలు స్వీకరించే మనస్తత్వం లేదన్నది ఆ పార్టీనేతల నుంచే విన్పిస్తున్న మాట. ఏకఛత్రాధిపత్యంగా ఏలాలని ఈ ద్వయం కలలు కన్నారు. మిత్రపక్షాలను, జనం సమస్యలనూ పట్టించుకోలేదు. పెట్రోలు దగ్గర నుంచి గ్యాస్ వరకూ, నిత్యవసరాల నుంచి కూరగాయల వరకూ ధరలు మిన్నంటాయి. సామాన్యుడి నుంచి ఎగువ మధ్యతరగతి ప్రజలు మోడీ పాలన పట్ల విసుగు చెందారన్నది ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఓటమి ఎవరి ఖాతాలో....

రాజస్థాన్ లో జరిగిన ఆల్వార్, అజ్మీర్ సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. అక్కడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా ప్రజలు తిరస్కరించారు. బీహార్ లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నా అక్కడ కూడా అరారియా లోక్ సభ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ కైవసం చేసుకుంది. ఇక యూపీని కూడా కమలం పార్టీ ఏలుతున్నప్పటికీ ఫుల్ పూర్, గోరఖ్ పూర్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించలేదంటే ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతేనన్నది విశ్లేషకుల అంచనా. రాజస్థాన్ కు వచ్చేసరికి ఓటమి నెపాన్ని స్థానిక వసుంధర రాజేపై నెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు యోగీ ఫెయిల్యూర్ అయ్యారా? లేక మోడీ విఫలమయ్యారా? ఈఅపజయాన్ని ఎవరి ఖాతాలో వేస్తారు? దీనికి సమాధానం కమలం పార్టీ పెద్దలే చెప్పాల్సి ఉంటుంది. కాంగ్రె్స్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మీద పాజిటివ్ వేవ్ లేక పోవచ్చు. కాని మోడీ మీద మాత్రం నెగిటివ్ వేవ్ స్టార్టయిందని చెప్పకతప్పదంటున్నారు విశ్లేషకులు.

Similar News