రెండు తెలుగు రాష్ట్రాలతోనూ కేంద్రం నీటి ఆటలు ఆడుతోంది! ఏపీలో ఒకలాగా, తెలంగాణలో మరోలాగా కేంద్రం వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని పలువురు దుయ్యబడుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో గడిచిన రెండు మాసాలుగా కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోంది. ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదు. అదే సమయంలో రాష్ట్రానికి స్వేచ్ఛనివ్వడం లేదు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును చేర్చిన నేపథ్యంలో నిర్మాణ బాధ్యత కేంద్రానికి మాత్రమే ఉంటుందనేది నిపుణుల మాట. అయితే, పోలవరం ప్రాజెక్టను ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత తొందరగా రైతులకు మేలు చేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం అడ్డుపుల్ల...
ఈ క్రమంలోనే ప్రతి సోమవారాన్నీ సీఎం చంద్రబాబు పోలవారంగా మార్చుకున్నారు. ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ.. అధికారులు, సిబ్బందిని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో పనులు ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైన కాంట్రాక్టు పనులను రెండుగా విభజించి వేరేవారికి అప్పగించైనా గడువులోగా పోలవరం పూర్తి చేయాలని బాబు నిర్ణయించారు. అయితే, దీనికి కేంద్రం నుంచి అడ్డుపుల్ల తగిలింది. ప్రాజెక్టు మాదైతే.. మీరెలా పూర్తి చేస్తారంటూ కేంద్రం ప్రశ్నించింది. ప్రతి విషయాన్నీ మాకు చెప్పాలని పట్టుబట్టింది. దీంతో చంద్రబాబు తీవ్రంగా నిరుత్సాహపడ్డారు.
తెలంగాణలో మరోలాగా...
ఏపీలో కేంద్రం అనుసరిస్తున్న పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ విషయానికి వచ్చే సరికి మాత్రం డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం నడుస్తోంది. నిజానికి ఏపీలో ప్రభుత్వంలో మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ.. మొండిచేయి చూపుతూ.. తెలంగాణలో విపక్షంగా ఉండి కూడా సాయం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇక్కడి కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న పర్యావరణ అనుమతులను కేంద్రం క్లియర్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది.
ఏపీకి మాత్రం కష్టాలే....
ఇప్పటికే శరవేగంగా కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు.. పర్యావరణ అనుమతులు రావడంతో మరింత వేగవంతం కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రధాన అనుమతులైన అటవీశాఖ, పర్యావరణ శాఖ అనుమతులు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవే అనుమతులు పొందేందుకు ఏపీ ప్రభుత్వం నానా తిప్పలు పడుతుండడం గమనార్హం. సో.. ఇదీ ఏపీ, తెలంగాణలతో కేంద్రం ఆటలు..!