బీజేపీ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మోడీ సర్కార్ ను వదిలిపెట్టడం లేదు. నిన్న గాక మొన్న యశ్వంత్ సిన్హా నోట్ల రద్దు పై మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మోడీ విధానాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మందతగించింందని వ్యాఖ్యానించడంతో బీజేపీలో కలకలం రేగింది. తాజాగా అమిత్ షా కుమారుడి వ్యవహారంలో కూడా ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు. అమిత్ షా కుమారుడు జైషా కు సంబంధించిన కంపెనీల షేర్ల ధరలు పెరగడం ఇటీవల వివాదమయింది. దీనిపై కూడా యశ్వంత్ స్పందించారు. అమిత్ షా కుమారుడిపై అవినీతి ఆరోపణలు రావడం పార్టీకి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇక బీజేపీకి నైతికత ఎక్కడుందని యశ్వంత్ ప్రశ్నించడం కలకలం రేపింది.
తప్పు జరిగినట్లే ఉంది.....
అంతేకాకుండా అమిత్ షా కుమారుడు జై షా తన కంపెనీపై వార్త రాసిన ది వైర్ వెబ్ సైట్ పై వంద కోట్లకు పరువునష్టం దావావేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అమిత్ షా కుమారుడు జై షా ఆస్తులు పదహారు వేల రెట్లు పెరిగాయన్నది ఆ వెబ్ సైట్ కథనం. దీనిపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ కూడా అమిత్ షా కుమారుడి కంపెనీలో అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. అయితే యశ్వంత్ మాత్రం వదిలపెట్టలేదు. అమిత్ షా కొడుకు కేవలం వ్యాపార వేత్త మాత్రమేనని, ఆయన కేసులో వాదించడానికి ప్రభుత్వ న్యాయవాదిని ఎలా వాడుకుంటారని యశ్వంత్ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాది అయిన తుషార్ మెహతాను జై షా కేసులో వాదనకు నియమించడం వివాదమయింది. దీన్ని తప్పుపట్టిన యశ్వంత్ బీజేపీ సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. విద్యుత్తు శాఖ మంత్రి పియూష్ గోయల్ అమిత్ షా కుమారుడు జైషా కు రుణాన్ని మంజూరు చేసిన విధానాన్ని చూస్తుంటే ఎక్కడో తప్పు జరిగినట్లే కన్పిస్తుందని యశ్వంత్ అభిప్రాయపడ్డారు. వెంటనే ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించాలని కూడా సిన్హా డిమాండ్ చేశారు. మొత్తం మీద వీలు చిక్కినప్పుడల్లా యశ్వంత్ బీజేపీ పాలనపై విరుచుకుపడుతున్నారు.