బీజేపీ ద్వయంపై సొంత పార్టీ నేతలు క్రమంగా గళం విప్పుతున్నారు. ఇప్పటి వరకూ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వారిద్దరిదే పెత్తనం. వారు చెప్పిందే వేదం. వారు అనుకున్నదే జరుగుతుంది. వారే భారత ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వీరిద్దరూ పార్టీలో సీనియర్లను సయితం పక్కన పెట్టి పక్కా బిజినెస్ గా మార్చేశారని, సిద్ధాంతాలను పక్కనపెట్టేశారన్న ఆరోపణలు ఎప్పటినుంచో విన్పిస్తున్నాయి. యశ్వంత్ సిన్హా లాంటి నేతలు జీఎస్టీ పై విరుచుకుపడ్డారు. పాలన తీరు మార్చుకోవాలని సూచించారు. తాజాగా బీజేపీ కి చెందిన లోక్ సభ సభ్యుడు శత్రుఘ్న సిన్హా మోడీ, షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటి వరకూ విపక్ష పార్టీ నేతలు కూడా చేయని విమర్శలు చేశారు.
గుజరాత్ లో కష్టమేనని......
బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా తరచూ బీజేపీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. బీజేపీలో వన్ మేన్ షో... టుమెన్ ఆర్మీకి చరమగీతం పలకాలని శతృఘ్న సిన్హా ఒక రేంజ్ లో విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. ముఖ్యంగా రైతులు, వ్యాపారులు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి కష్టకాలమేనని జోస్యం చెప్పారు. గుజరాత్ లో హార్థిక్ పటేల్ ను పార్టీ వైపుకు తిప్పుకోవడంలో అగ్రనాయకత్వం ఫెయిలందన్నారు. మొత్తం మీద శతృఘ్న సిన్హా వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
.