మోడీ వీరిద్దరి ఆటను కట్టేస్తారా?

Update: 2017-12-05 04:30 GMT

చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఉద్యోగాల్లో బిసిలకు ప్రమోషన్లు కల్పించాలి. కేంద్ర కేబినెట్ లో బిసిలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఈ మూడు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. వీటిని తెలంగాణ సర్కార్ కేంద్రంలోని బిజెపి సర్కార్ పై అస్త్రాలుగా వదిలిపెడుతుంది. వీటితో బిసిలకు తానే దేవుడిగా వుండాలని కేసీఆర్ స్కెచ్ గీశారు. తెలంగాణ ప్రజల్లో ఒక వర్గం వారిని శాశ్వతంగా ఓటు బ్యాంక్ గా టిఆర్ఎస్ కి వెన్నెముకగా మలచడానికి దూర దృష్టితో కేసీఆర్ అమలు చేయబోతున్న వ్యూహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాపులకు రిజర్వేషన్లతో చంద్రబాబు ....

తెలంగాణాలో బిసిలు మెజారిటీ వర్గం. కాగా ఏపీలో కాపులు ప్రతి ఎన్నికలను ప్రభావితం చేసే మెజారిటీ వర్గం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఏడాది ముందే తాయిలాలు కులాల వారీగా అందించే ప్రక్రియ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం వెనుక భవిష్యత్తు ఎన్నికలే ప్రధానం. దాంతో బాటు కేంద్రంలోని బిజెపి పై ఈ అంశాన్ని పెట్టి వారి వల్లే జరగలేదని నెపం మోపడం లక్ష్యంగా కనిపిస్తున్నాయి.

ముల్లును ముల్లుతోనే మోడీ తీసేస్తారా ..?

గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ పీఠం పై కూర్చున్న మోడీ ఇలాంటి రాజకీయ ఎత్తుగడలను సమర్ధంగా తిప్పి కొడతారని కమలనాధులు అంచనా వేస్తున్నారు. తనపై ప్రాంతీయ పార్టీలు ప్రయోగించిన అస్త్రాలను రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మార్చుకుని ఏపీ, తెలంగాణాలో ఆయా సామాజిక వర్గాలను తాము మళ్ళీ అధికారం సాధిస్తే ఇవన్నీ అమలు చేస్తామని బిజెపి హామీలు గుప్పించనుందని టాక్. న్యాయపరమైన వివాదాలు తలెత్తేలా చేసి రాజకీయ లబ్ది కోసమే ప్రాంతీయ పార్టీలు ఓట్ల కోసం గాలం వేశాయని ప్రచారాన్ని బిజెపి అందుకుంటుందంటున్నారు ఆ పార్టీ వారు. ఒక శాస్త్రీయమైన కమిటీ ద్వారా దేశవ్యాప్తంగా అధ్యయనం జరిపి న్యాయం చేస్తామని హామీతో జనంలోకి వెళ్ళడానికి కమలనాధులు వ్యూహ రచన చేస్తున్నట్లు తెలియవస్తుంది. కులాలు, మతాల ఓటు బ్యాంక్ లు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఒకరి నుంచి నేర్చుకోవాలిసిన పనిలేదని చాలా రాష్ట్రాల్లో తమ విజయాలే తమ వ్యూహాలను చెప్పక చెబుతున్నాయంటున్నారు బిజెపి లోని కొందరు. దాంతో రాబోయే ఎన్నికల్లో బాబు, కేసీఆర్ ఎత్తుగడలకు మోడీ, షా ద్వయం ఎలా చెక్ పెడుతుందో చూడాలి.

Similar News