ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారా? వచ్చే ఎన్నికలకు వ్యూహాన్ని రచించుకునేందుకు ఇప్పుడే సిద్ధమవుతున్నారా? ఇటీవల రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓటమితో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాల గురించి తమ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 28వ తేదీన బీజేపీ ముఖ్య నేతలతోన ప్రధాని మోడీ సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ ఉంటుందని తెలుస్తోంది.
ఈ నెల 28న కీలక సమావేశం.....
ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొనాలని ఆదేశాలు వెళ్లాయి. ఇటీవల మోడీ గ్రాఫ్ తగ్గిందన్న సర్వేలు వెలువడటంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలపై ప్రజాభిప్రాయాన్ని నేతల ద్వారా తెలుసుకోనున్నారు. మొత్తం ఐదు అంశాల గురించి వివరించాల్సి ఉంటుందని, దీనిపై వివరాలు తీసుకురావాలని ముఖ్యమంత్రులకు పార్టీ అధిష్టానం నుంచి లేఖలు వెళ్లాయి. ఈ సమావేశంలో మొత్తం 14 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖమంత్రులతో పాటు ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికల విషయం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.