మోడీ మాట దక్కించుకుంటారా?

Update: 2017-12-16 00:30 GMT

రాత్రి ఎనిమిది గంట‌లు కావ‌స్తోంది. సామాజిక మాధ్య‌మ‌మైన ఫేస్ బుక్ వేదిక గా యువ ఎంపీ లైవ్ షో కండెక్ట్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రావ‌ళిని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా అంతా ఏక‌మై చెప్పిందొక్క‌టే ప్ర‌త్యేక జోన్ సాధించ‌మ‌ని..?? శ్రీ‌కాకుళం స్టేష‌న్ కి ఆధునిక హంగులు జోడించ‌మ‌ని?? ప‌్ర‌శ్న‌ల‌న్నింటికీ ఆయ‌న సానుకూలంగా స్పందించారు. ప్ర‌తి ఒక్క స‌మ‌స్య‌నీ ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.అయితే ఈ సంక‌ల్పం ఒక్క ఆయ‌న‌లోనే ఉంటే చాల‌దు న‌వ్యాంధ్ర ఎంపీలంతా ప్రాంతాల‌క‌తీతంగా పోరాడ‌ల‌గ‌ల‌గాలి. పార్టీల‌క‌తీతంగా గ‌ళ‌మెత్తాలి. కానీ ఇది సాధ్య‌మా..? రైల్వే స్టాండింగ్ బోర్డు క‌మిటీ స‌భ్యుడిగా ఉన్నరాము ప్రైవేట్ బిల్ ని మూవ్ చేసేందుకు సంబంధిత వ‌ర్గాల‌ను క‌లుస్తాన‌ని, త‌నకు సాధ్య‌మైనంత మేర కృషి చేస్తాన‌ని అంటున్నారు. బాగుంది ఇదే మాట గుంటూరు పెద్ద‌లూ అంటే ఎంత బాగుండు.

జోన్ కు సంబంధించి సాధ్యాసాధ్యాలు...

రైల్వే జోన్ల ఏర్పాటు, కొత్త మార్గాలు, డ‌బ్లింగ్‌, విద్యుదీక‌ర‌ణ‌లో వాస్త‌వాల ప్రాతిప‌దికన కాకుండా రాజ‌కీయాలే కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. మమ‌తా బెన‌ర్జీ పార్టీకి చెంద‌ని మంత్రి రైల్వే మంత్రిగా ఉన్న‌ప్పుడు బెంగాల్ కు ప్రాధాన్యం ఇచ్చారు. రామ్ విలాస్ పాశ్వాన్‌, నితీశ్ కుమార్‌, లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ లు రైల్వే మంత్రులుగా త‌మ రాష్ట్రానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు. పాశ్వాన్ త‌న నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన హాజీపూర్ కు రైల్వేజోన్ మంజూరు చేసి త‌న ప‌క్ష‌పాతాన్ని చాటుకున్నారు. వాస్త‌వానికి ఆదాయ‌ప‌రంగా హాజీపూర్ వెనుక‌బ‌డి ఉంది. ప్ర‌స్తుత రైల్వేజోన్ల‌లో స‌గం కూడా ఉండ‌దు. దీని ప‌రిధి : 3,628 కిలోమీట‌ర్లు.

ఇంకొంత....

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 17 జోన్లు ఉన్నాయి. ఉత్త‌ర రైల్వే అన్నింటి క‌న్నాపెద్ద‌ది. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సికింద్రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తోంది. దీని ప‌రిధిలో విజ‌య‌వాడ‌, గుంత‌క‌ల్‌, నాందేడ్ డివిజ‌న్లు ఉన్నాయి. దీనికి 6137 కిలోమీట‌ర్ల ట్రాక్ ఉంది. ఇక ఒడిశా పెత్త‌నం ఉత్త‌రాంధ్ర‌పై ఎక్కువ‌గానే ఉంది. విశాఖ జోన్ ఏర్పాటును ఏనాటి నుంచో ఒడిశా వ్య‌తిరేకిస్తోంది. దీని వ‌ల్ల త‌మ రాష్ట్రం న‌ష్ట‌పోతుంద‌న్న‌ది వారి వాద‌న‌.ఈ నేప‌థ్యంలో కేంద్రం ఏమంటుందో.. అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కం.ఓట్ల రాజ‌కీయాల్లో భాగంగా ఒడిశాని మ‌చ్చిక చేసుకుంటుంద‌న్న‌ది ఓ వాస్త‌వం. ఇటీవ‌ల బిజూ జ‌నతాద‌ళ్ కి పోటీగా ఇక్క‌డ ఎదిగేందుకు బీజేపీ విపరీతంగా ప్ర‌య‌త్నిస్తోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ త‌న హ‌వా చాటుకుంది. దీంతో కొన్నింట బీజేడీని, మ‌రొకొన్నింట కాంగ్రెస్‌ని సైతం నెట్టి ఇక్క‌డ నెగ్గుకు రావ‌డం ఓ విశేషంగా భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో తిరుగుబాటు పంథాలో లేని ఆంధ్ర ప్ర‌జ‌లకు ఏ మేర‌కు న్యాయం చేస్తుంద‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఇక ఎంపీ రాము ఏమంటున్నారంటే....

‘ప్రైవేటు మెంబ‌ర్ బిల్లుకు ఏ,బీ కేట‌గిరీలు ఉంటాయి. బిల్లు ప్రాధాన్యం అనుస‌రించి సంబంధిత క‌మిటీ కొన్నింటిని తొల‌గిస్తుంది. కానీ నేనుప్ర‌వేశ‌పెట్ట‌బోయే బిల్లు చ‌ర్చ‌కు వ‌చ్చేలా చూడాల‌ని క‌మిటీని కోరునున్నాను. చ‌ర్చ‌లో పాల్గొని రాష్ట్రానికి ప్ర‌త్యేక జోన్ ఎందుకు రావాలి అన్న విష‌య‌మై కూలంకుషంగా వివ‌రిస్తాను.ఈ సారి నా ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే. శీతాకాల స‌మావేశాలు జ‌న‌వ‌రి ఐదు వ‌ర‌కూ జ‌రుగుతాయి. రాబోవు సెష‌న్స్‌లో చ‌ర్చ‌కు అవ‌కాశం వ‌స్తే రావ‌చ్చు గాక కానీ ఈ స‌మావేశాల్లోనే ప్రైవేట్ మెంబ‌ర్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టేందుకే కృషిచేస్తా.’

Similar News