మోడీ ఫార్ములా ఇక్క‌డ ప‌నిచేయదా..?

Update: 2017-12-19 17:30 GMT

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వేసిన ఎత్తుగ‌డ, అమ‌లు చేసిన స్కెచ్ గుజ‌రాత్‌లో బీజేపీకి మ‌ళ్లీ ప్రాణం పోసింది. దీంతో రానున్న ఐదేళ్ల పాటు మ‌ళ్లీ కాషాయ ద‌ళ‌మే పాల‌నా పీఠం అధిరోహించ‌నుంది. ''నేను మీ గుజ‌రాతీని.. న‌న్ను చంపేందుకు కాంగ్రెస్ నేత మ‌ణి శంకర్ అయ్యర్ సుపారీ ఇచ్చారు'' అంటూ ఎన్నిక‌లు మ‌రో నాలుగు రోజులు ఉంద‌న‌గా ప్ర‌ధాని మోడీ చేసిన ప్ర‌సంగం అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కాంగ్రెస్ అంచ‌నాల‌ను త‌ల్ల‌కింద‌లు చేసింది. అంతేకాదు, నిత్యం లేచిన దగ్గ‌ర నుంచి ప‌డుకునే వ‌ర‌కు కూడా ప్ర‌ధాని ప‌రిత‌పించే 'అబివృద్ధి' నినాదం ప్ర‌జ‌ల్లోకి బాగా చొచ్చుకుపోయింది. ఇక‌, మోడీ ఎక్క‌డ మీటింగ్ పెట్టినా 'స‌బ్‌కా వికాస్' అనే ప్రారంభిస్తారు. అయితే, అనూహ్యంగా గుజ‌రాత్‌లో గ‌త ఐదేళ్ల‌లో అభివృద్ధి స్థానంలో ప‌టేళ్ల ఆందోళ‌న‌, గోహ‌త్య‌లు అనంత‌ర ఆందోళ‌న‌లు, సీఎంల మార్పు వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో గుజ‌రాత్‌లో బీజేపీ ప‌ని అయిపోయింద‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.

ఆ సెంటిమెంట్ ఇక్కడ....

ఈ నేప‌థ్యంలో గుజ‌రాత్‌లో నిర్వ‌హించిన ఎన్నికల ర్యాలీల్లో ఎక్క‌డా అభివృద్ధి అనే మాట వినిపించ‌కుండా, అనిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. కేవ‌లం త‌న‌ను తాను పొగుడు కోవ‌డం, బీసీ అని చెప్పుకోవ‌డం కాంగ్రెస్ నేత‌ల పాత సంగ‌తులు బ‌య‌ట పెట్ట‌డం ద్వారా గుజ‌రాత్‌లో మోడీ భారీ ఎత్తున ల‌బ్ధి పొందార‌నేది వాస్త‌వం. ఇక‌, ఈ గెలుపును భారీస్థాయిలో పండ‌గ చేసుకుంటున్న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు 2019లో ఎన్నిక‌లు జ‌రిగే ఏపీ, తెలంగాణ‌ల్లోనూ, వ‌చ్చే నెల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ ఇదే ఫార్ములాను ముందుకు తీసుకు వెళ్ల‌డం ద్వారా ప్ర‌యోజనం ఉంటుంద‌ని పార్టీ గ‌ట్టెక్కుతుంద‌ని నేత‌లు భావిస్తున్నారు. అయితే, విశ్లేష‌కులు మాత్రం.. గుజ‌రాత్ ప‌రిస్థితి వేరు, మిగిలిన రాష్ట్రాల ప‌రిస్థితి వేర‌ని చెబుతున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోకి వెళ్లి మోడీ సెంటిమెంట్‌ను ఎలా పెంచుతార‌ని, ప్ర‌చారం చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మోడీ హవా ఇక్కడ ఉండదా?

ఇక‌, ఏపీ, తెలంగాణ‌ల్లో పూర్తిస్థాయిలో జెండా మోసే వారు కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని చెబుతున్నారు. కేడ‌ర్ లేకుండా ఎన్ని ప్ర‌చారాలు చేసి ప్ర‌యోజనం ఏంట‌నేది విశ్లేష‌కుల వ్యాఖ్య‌. గుజ‌రాత్ లో విజ‌యం సాధించ‌డంతో బీజేపీ బ‌లం మ‌రింతగా పెరింగిందనీ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్రాకి బీజేపీ మాత్ర‌మే ప్ర‌త్యామ్నాయ‌మౌతుంద‌ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానిస్తున్నారు! క‌మ‌ల బ‌లం రోజురోజుకీ పుంజుకుంటోంది కాబట్టి, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీతో పొత్తు ఉన్నా… సీట్ల విష‌య‌మై తాము శాసించే స్థాయిలో ఉంటామ‌ని ఆయ‌న అంటున్నారు. గుజ‌రాత్ ఫ‌లితాల వ‌ల్ల ఆంధ్రాలో త‌మ‌కు ప్రాధాన్య‌త పెరుగుతుంద‌నేది నేత‌ల విశ్లేష‌ణ‌. తెలంగాణ‌లో అయితే సీఎం కేసీఆర్ క‌మ‌లాన్ని పూర్తిగా చిదిమేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక్క‌డ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ ఎంట్రీ త‌ర్వాత బీజేపీని ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు. వీక్ అయిన కాంగ్రెస్ ఒక్క‌సారిగా పుంజుకుంది. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు లేక‌పోతే బీజేపీ ఆ మాత్రం సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నది అందరికీ తెలిసిందే. ఇక త‌మిళ‌నాడులో బీజేపీ జ‌య త‌ర్వాత స్థానిక పార్టీల మ‌ధ్య చిచ్చుకు ట్రై చేసి త‌మిళ జ‌నాల్లో విల‌న్ అయ్యింది. ఈ ప‌రిణామ‌ల నేప‌థ్యంలో గుజ‌రాత్ వేరు, ఏపీ,తెలంగాణల ప‌రిస్థితి వేర‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. మ‌రి 2019 నాటికి రాజ‌కీయాలు ఏ మ‌లుపు తిరుగుతాయో చూడాలి.

Similar News