కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుంటోంది. ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో మోడీ గాలి బలహీనపడటం, కాంగ్రెస్ క్రమంగా బలం పెంచుకోవడం జరుగుతోంది. ఈ విషయం తాజాగా సర్వేలో వెల్లడయింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపై ఇండియా టుడే-కార్వి ఒపీనియన్ సర్వే చేసింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే 40 శాతం ఓట్లతో బీజేపీ కూటమి 258 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. అలాగే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమి 38 శాతంతో 202 స్థానాలను దక్కించుకోగలుగుతుందని ఈ సర్వేలో స్పష్టమైంది.
కేవలం రెండుశాతం మాత్రమే....
అంటే బీజేపీకి, కాంగ్రెస్ కు ఓట్ల తేడా కేవలం రెండు శాతం మాత్రమే. అలాగే సర్వేలో తెలిపిన ప్రకారం రెండు పార్టీల మధ్య సీట్ల తేడా కూడా 56 సీట్లు మాత్రమే. అయతే ఇదే సర్వేలో ఇతర పార్టీలు 22 శాతం ఓట్లతో 83 సీట్లు దక్కించుకుంటాయని తేలింది. అంటే ఈ సర్వేను బట్టి వచ్చే ఎన్నికలు మోడీకి అంత ఈజీకాదని అర్థమయిపోయింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాయని ఈ సర్వే ద్వారా స్పష్టమయిందంటున్నారు. అవినీతి మచ్చ లేని మోడీ నాయకత్వాన్ని నమ్మే గత ఎన్నికల్లో బీజేపీకి అనూహ్య విజయాన్ని అందించారు ఓటర్లు.
మోడీ పై ఆశలు ఆవిరయ్యాయా?
అయితే మోడీ పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. సంస్కరణల పేరిట విధ్వంసం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ మోడీ నాయకత్వ పటిమను పొగిడేసిన మేధావులు, విశ్లేషకులు సయితం ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. 2016 వరకూ మోడీకి తిరుగులేదు. అయితే 2017 నుంచి మోడీపై వ్యతిరేకత ప్రారంభమయిందంటున్నారు విమర్శకులు. సాధారణ ప్రజలు, వ్యాపార వర్గాలు, వేతన జీవులు సయితం మోడీ నాయకత్వంతో ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయానికి వచ్చారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ప్రధానిగా మోడీకి మంచి మార్కులు...కాని...
అయితే ఇదే సర్వేలో తర్వాత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ కి 53 శాతం మంది ఓట్లేశారు. అంటే మరోసారి మోడీయే ప్రధాని కావాలని 53 శాతం మంది కోరుకుంటుననారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాత్రం కేవలం 22 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా నిరుద్యోగం, ధరల పెరుగుదల మోడీకి ముప్పుగా మారనున్నాయని సర్వే వెల్లడించింది. అయితే ఇదే దశలో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుందన్న విశ్లేషణలూ విన్పిస్తున్నాయి. కాని ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో మోడీ మ్యాజిక్ తో తాము మ్యాజిక్ ఫిగర్ దాటేస్తామనిన కమలనాధులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దేశంలో మోడీ పార్టీకి ఎదురుగాలి వీస్తుందని, విజయం అనుకున్నంత సులువు కాదని ఈ సర్వేలో స్పష్టమైంది.