బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై జిగ్నేశ్ మెవానీపై మండిపడ్డారు. తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకపోయినా తనపై తప్పుడు కేసులు బనాయించేలా వత్తిడి తెస్తున్నారని మెవానీ ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31 వ తేదీన పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మెవాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పోలీసులు కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే తాను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదని మెవానీ చెబుతున్నారు. మహారాష్ట్రలోని భీమా కొరెగావ్ కు తాను వెళ్లలేదని మెవానీ చెప్పారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి కమలం పార్టీ, ఆర్ఎస్ఎస్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయన్నారు.
ఈ నెల 9న యువజన ర్యాలీ....
దళితులపై దేశంలో దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు మెవానీ. ఇలాగే జరిగితే 2019 లోక్ సభ ఎన్నికల్లో దళితులు ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెబుతారని తెలిపారు. గుజరాత్ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి ఆ ఫలితాలు సంతృప్తికరంగా లేవని, అందుకోసమే ఆ అక్కసును దళితలుపై చూపుతుందన్నారు జిగ్నేశ్. అయితే తాము దేశంలో సామాజిక న్యాయం జరగాలని కోరుతూ ఈ నెల 9న యువజన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ర్యాలీ అనంతరం తాను ఒకచేతిలో భారత రాజ్యాంగాన్ని, మరో చేతిలో మనుస్మృతిని పట్టుకుని ప్రధాని మోడీ వద్దకు వెళతానని, ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటారని ప్రశ్నిస్తానని జిగ్నేశ్ తెలిపారు.
పరుగుపెట్టిన రాహుల్ సన్నిహితుడు...
అయితే జగ్నేశ్ మెవాని ఈరోజు ఢిల్లీలో పత్రికా సమావేశంనిర్వహించారు. ఈ సమావేశం వద్దకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సన్నిహితుడు అలంకార్ సవాయ్ వచ్చారు. దీంతో కొందరు మీడియా ప్రతినిధులు ఈ సమావేశాన్ని రాహుల్ స్పాన్సర్ చేశారా? అని ప్రశ్నలందుకున్నారు. రాహుల్ పంపారా? అన్న ప్రశ్న విన్న అలంకార్ సవాయ్ అక్కడి నుంచి పరుగు పెట్టారు. ప్రెస్ క్లబ్ నుంచి బయటకు పరుగుతీసిన అలంకార్ సవాయ్ ఆటో ఎక్కి వెళ్లడం గమనార్హం. ఇదే ప్రశ్నను ఒక ఛానల్ ప్రతినిధి జిగ్నేశ్ మెవానిని అడగ్గా ఆ ఛానల్ మైకును విసిరేసి మెవాని వెళ్లిపోయారు.