ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మళ్లీ కాంగ్రెస్ ను కకావికలం చేయడానికి కమలం పార్టీసిద్ధమవుతుందా. సాధారణ ఎన్నికలకు ముందే హస్తం పార్టీని అతలాకుతలం చేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడో జరిగిన భోఫోర్స్ కుంభకోణాన్ని మళ్లీ వెలుగులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు సీబీఐకి సర్కార్ పచ్చజెండా ఊపినట్లు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ హయాంలో ఈ బోఫోర్స్ కుంభకోణం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న హిందూజా సోదరులను ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా 2005లో ప్రకటించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పు తర్వాత సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించినా... అప్పట్లో వీలుపడలేదు. అప్పట్లో యూపీఏ సర్కార్ అధికారంలో ఉండటం వల్లనే అది సాధ్యం కాలేదన్నది ఇప్పుడున్న కేంద్రం పెద్దల వాదన. అందుకే సీబీఐకి కౌంటర్ దాఖలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
కక్ష సాధింప చర్యేనా?
అయితే వరుసగా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత సాధారణ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బోఫోర్స్ కేసును వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కన్పిస్తుంది. సీబీఐ కూడా ఇందుకు సిద్ధమైంది. వాస్తవానికి తీర్పు వచ్చిన 90 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా సీబీఐ ఆ పని చేయలేదు. అయితే ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంటే బోఫోర్స్ కేసు మరోసారి ప్రజల ముందుకు రానుందన్నమాట. ఈ కేసుతో కాంగ్రెస్ ప్రతిష్టను దిగజార్చాలన్నది కమలం పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే కాంగ్రెస్ నేతలు ఈ వార్తలపై మండిపడుతున్నారు. ముగిసిన కేసును తిరగదోడటమంటే..కక్ష సాధింపు చర్యేనంటున్నారు. మూడున్నరేళ్లు మౌనంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడే దీనిని బయటకు తీయాలనుకోవడానికి కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద మోడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు సినిమా చూపించేందుకు సిద్ధమయ్యారన్న మాట.