తెలంగాణ బీజేపీకి పార్టీ హైకమాండ్ వ్యూహాలు అర్థం కావడం లేదా? రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అసలే బాగా లేకుంటే పార్లమెంటులో మోడీ ప్రసంగం ఇక్కడి బీజేపీ నేతల్లో నిరుత్సాహం నింపింది. ప్రధాని మోడీ రాష్ట్ర విభజన అంశంపై మాట్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తలలు పట్టుకుంటున్నారు ఇక్కడ నేతలు. తమను కొంతకాలంగా పార్టీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదని మధనపడుతున్నారు. ఎన్నికల సమయంలో పట్టించుకుంటే అప్పుడు అంతా అయిపోతుందని, ఇప్పటి నుంచే తమను గాడిలో పెట్టాలని ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా మోడీ పార్లమెంటులో చేసిన ప్రసంగం ఇక్కడి నేతలకు మరింత ఇబ్బందిగా మారింది.
తెలంగాణను కించపర్చేలా?
మోడీ ప్రసంగించిన తీరు తెలంగాణను కించపరుస్తూ మాట్లాడారన్నది ఆ పార్టీ నేతల మనోగతం. విభజన వల్ల ఆంద్రప్రదేశ్ కు నష్టం జరిగిందని, తలుపులు మూసి మరీ అర్ధరాత్రి విభజించిందని కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించే ప్రయత్నం మోడీ చేసినప్పటికీ ఇక్కడి బీజేపీ నేతలకు ఆయన ప్రసంగం మింగుడు పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, టీఆర్ఎస్ కు అసలైన ప్రత్యమ్నాయం తామేనని ఇన్నాళ్లూ చెప్పుకుంటూవచ్చారు నేతలు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దూసుకుపోతోంది.
అధినాయకత్వం పట్టించుకోలేదని....
ఈ విషయాన్ని రాష్ట్ర నేతలు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాంగ్రెస్ బలం పుంజుకోకముందే ఇక్కడ కన్ను వేయమని సూచించారు కూడా. కాని అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా తాజాగా మోడీ చేసిన ప్రసంగంతో తెలంగాణ బీజేపీ నేతలు డీలా పడ్డారు. మోడీ ప్రసంగంపై ఇక్కడి పార్టీలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వీరిది. అధిష్టానం తమను పెద్దగా పట్టించుకోవడం లేదన్నది వీరికి అర్థమైపోయింది. ఇప్పటికే పార్టీలో ఎవరూ చేరక, పార్టీని ముందుకు తీసుకెళ్ల లేక అవస్థలు పడుతున్నారు. జోరుగా ఉంటాయనుకున్న వలసలు కూడా ఆ ఊసే లేకుండా పోయాయి.
ప్రసంగం నష్టమేనంటున్న....
మోడీ మాట్లాడిన ప్రతి మాట ఇక్కడ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని రాష్ట్రనేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ఎంపీలు ఆందోళనలు చేస్తుండటంతో వారిని వెనకేసుకు రావడం కోసం ఇక్కడ పార్టీని పణంగా పెట్టడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా ముద్ర వేసుకున్నామని, మోడీ ప్రసంగంతో అది కూడా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఇక రాష్ట్రంలో పార్టీ ఎలా ఎదుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కమలనాధులకు మోడీ ప్రసంగం రుచించలేదు.