మోడీ అంగీకరిస్తారా? చంద్రబాబు ఒప్పుకుంటారా?

Update: 2018-01-12 00:30 GMT

ఏడాది తర్వాత ఇద్దరూ కలవబోతున్నారు. ఏడాదికాలంలో ఎన్నో సమస్యలు. ఎన్నో అవరోధాలు. కాని మనసు విప్పి చెప్పుకోవడానికి మార్గం కన్పించలేదు. ఇప్పుడా అవకాశం దొరికింది. అయితే ఈ సమావేశంలో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించబోతున్నారన్న దానిపై ఏపీలోని అన్ని రాజకీయపక్షాల్లో చర్చోప చర్చలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాలు, జీఎస్టీ, నోట్ల రద్దు తర్వాత మోడీ ప్రభావం మందగించిందన్నది అందరూ అంగీకరిస్తున్న విషయమే. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ఇప్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. అయితే ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కేంద్ర సర్కార్ పట్టించుకో్క పోవడంపై బీజేపీ పై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు.

నేడు మోడీతో భేటీ....

ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు ఒకానొక దశలో బీజేపీకి బై..బై.. చెప్పేయాలనే అనుకున్నారు. కాని కొత్త రాష్ట్రం... ఆర్థికంగా ఇబ్బందులు ఉండటంతో కేంద్రం సాయం చేస్తుందేమోనన్న చిన్న ఆశతో ఆ ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. లేకుంటే నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బీజేపీకి రాం రాం తమ అధినేత చెప్పేవారని టీడీపీ సీనియర్ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీతో భేటీ అయి రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించాలని ఏడాదిగా ప్రయత్నిస్తున్నారు. కాని ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ చంద్రబాబుకు లభించలేదు. చివరిగా రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో విపక్షాలతో చేయి కలిపితే గాని పీఎం నుంచి స్పందన రాలేదన్నది టీడీపీ వర్గాల అభిప్రాయం.

కోర్కెల చిట్టాతో మోడీ ముందుకు....

ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఎన్నాళ్ల నుంచో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కోరుతూనే ఉన్నారు. కాని ఇంతవరకూ దీనిపై ఫైలు ముందుకు కదలలేదు. నియోజకవర్గాల పునర్విభజన చేయాలని, విభజన చట్టంలో ఉంది కనుక చేయాల్సిందేనని మోడీని చంద్రబాబు ముఖ్యంగా కోరనున్నారు. చంద్రబాబుకు నియోజకవర్గాల పెంపు అత్యవసరం. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో పసుపు పార్టీ ఫుల్లయిపోయింది. నియోజకవర్గాల పెంపు జరగకపోతే వచ్చే ఎన్నికల్లో రెబల్స్ బెడద తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల పార్టీకి నష్టం. అందుకే ఈ అంశాన్ని ప్రధానంగా మోడీతో చంద్రబాబు చర్చించనున్నారు. ఇక రెవెన్యూ లోటుతో ఏపీ అష్టకష్టాల్లో ఉంది. రెవెన్యూ లోటును భర్తీ చేస్తామని చెప్పిన కేంద్రం ఇంతవరకూ పైసా విదల్చ లేదు. అలాగే పోలవరంపై కూడా చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నారు. పోలవరానికి అడుగడుగునా ఏర్పడుతున్న అడ్డంకులతో పాటు, నిధుల విడుదలలో జరుగుతున్న జాప్యాన్ని కూడా తెలియజేయనున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై సవివరంగా ఒక ఫైలును చంద్రబాబు మోడీ వద్దకు తీసుకెళుతున్నట్లు సమచారం. ఒకవేళ తాను అనుకున్న విషయాలన్నీచెప్పకుంటే నివేదికను ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. చంద్రబాబు కోరికల చిట్టాకు మోడీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాల్సి ఉంది.

Similar News