పోలవరం ప్రాజెక్ట్ శరవేగంగా నడుస్తుందంటూ ముందు డప్పు కొట్టారు. విపక్షాల పనుల తీరును నిగ్గదీయడం తో అసెంబ్లీ నుంచి అధికారపక్షం సభ్యులు లోకేష్, బాలయ్య నేతృత్వంలో వచ్చి ఆహా.... ఓహో అంటూ పోలవరాన్ని, పట్టిసీమను కీర్తించి ఇలా వెళ్లారు. కట్ చేస్తే సీన్ రివర్స్ . అంతా ఆరోపిస్తున్నట్లు పోలవరం లో పనులు నత్తనడకన సాగుతున్నాయని, ముఖ్యంగా హెడ్ వర్క్స్ పనులు మరీ దారుణం అంటూ అప్పటిదాకా శరవేగం అన్న ఏపీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే పోలవరం పూర్తి అయినట్లే అంటూ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. తక్షణం ప్రధాన కాంట్రాక్టర్ తో కుదిరిన ఒప్పందంలోని 60 సి క్లాజ్ ప్రకారం కొత్త వారికి పనులు అప్పగించి పూర్తి చేస్తామని కొత్త టెండర్లు సైతం పిలిచేశారు. దీనిపై ఎంపి రాయపాటి సాంబశివరావు కు చెందిన ట్రాన్స్ స్ట్రాయి ఢిల్లీ లో చంద్రబాబు కు వ్యతిరేకంగా పావులు కదిపింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్ట గా మారింది. ఎలాగైనా తాము పిలిచిన టెండర్లు ప్రకారం కొత్త కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చేయాలన్న చంద్రబాబు ప్రయత్నానికి ఆదిలోనే కేంద్రం అడ్డుకట్ట వేసింది. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అనుమతి లేకుండా టెండర్లు తక్కువ సమయంలో తప్పుల తడకగా పిలవడం, కొత్త కాంట్రాక్టర్లు వస్తే ప్రాజెక్ట్ వ్యయం 35 శాతం పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేయడంతో కథ మొదటికి వచ్చింది.
ట్రాన్స్ స్ట్రాయి కి నెల గడువు ....
చంద్రబాబు ఇద్దామనుకున్న కొత్త కాంట్రాక్టర్లకు బ్రేక్ ఇచ్చారు కేంద్రమంత్రి గడ్కరీ. పాత కాంట్రాక్టర్ కే నెలరోజులు సమయం ఇచ్చి పనులు పరిశీలన చేసి ఆ తరువాత నిర్ణయిస్తామన్నారు గడ్కరీ. ఇది ఒకరకంగా ఏపీ సర్కార్ చర్యలను కాదనడం తో బాటు రాయపాటి వైపే కేంద్రం మొగ్గు చూపడం అన్నట్లే వుంది. దీనికి కారణాలు కూడా గడ్కరీ సిద్ధం చేశారు. కొత్త వారికీ ఇస్తే వ్యయం పెరిగిపోతుందని చెబుతూ తాను సీన్లోకి దిగుతున్నా ఇప్పుడు చూడండి అనే రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఇక చంద్రబాబు నొచ్చుకోకుండా పాత కాంట్రాక్టర్ 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిలో విఫలం అయితే మీరు పిలిచిన టెండర్ దార్లు ఎలాగూ ఉన్నాయంటూ ముక్తాయింపు ఇచ్చారు గడ్కరీ. ఇలా కర్ర విరగకుండా పాము చావకుండా గడ్కరీ వ్యవహారం నడపడం వెనుక రాయపాటి డైరెక్షన్ ఉందని చివరికి ఆయన పంతమే నెగ్గిందని పొలిటికల్ టాక్.