మైసూరా కేసులో కేంద్రానికి అక్షింతలు తప్పవా?

Update: 2016-11-30 01:46 GMT

ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వడానికి ఆంక్షలేమిటి? ‘ఐ ప్రామిస్ టూ పే’ అంటూ రిజర్వు బ్యాంకు గవర్నర్ హోదాలో ప్రమాణం చేసిన తర్వాత.. ఆ ఇవ్వవలసి ఉన్న డబ్బుపై రేషన్ విధించడం, నిబంధనల రూపేణా ప్రజల డబ్బును ఇవ్వకుండా చూడడం అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టులో దాఖలైన కేసులో కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు తప్పేలా లేదు.

నోట్ల రద్దు గురించి కేంద్రం తెచ్చి న నోటిఫికేషన్ చట్ట విరుద్ధం అంటూ హైదరాబాదులోని ఓ న్యాయవాది వేసిన పిటిషన్ తో పాటూ, బ్యాంకులు ఖాతాదారులకు సొమ్ము లేదని చెప్పడం, సొమ్ము విత్ డ్రాయల్ పై పరిమితి విధించడం రాజ్యాంగ విరుద్ధం అంటూ సీనియర్ నేత మైసూరారెడ్డి వేసిన పిటిషన్ లను హైకోర్టు మంగళవారం నాడే విచారించింది.

అయితే కేంద్రం తరఫున న్యాయవాది మాత్రం నోట్ల రద్దుకు చట్టసవరణ అవసరం లేదని నోటిఫికేషన్ సరిపోతుందని వాదించారు. అయితే కోర్టు ఈ విషయంలో కేంద్రం వాదనలతో ఏకీభవించలేకపోయింది. మీ నిర్ణయానికి చట్టబద్ధత ఉన్నదా అని ప్రశ్నించింది. బ్యాంకుల్లో నగదు తీసుకోవడంపై పరిమితి విధించే అధికారానికి చట్టబద్ధత ఉందా అంటూ న్యాయస్థానం ప్రశ్నించడం విశేషం. ఈ విషయంలో కేంద్రం మరియు ఆర్బీఐ కౌంటర్లు వేయాలంటూ ఆదేశించింది.

ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, హైకోర్టులు ఈ కేసులు విచారించే అవసరం లేకుండా దేశంలో అన్ని హైకోర్టుల్లో నమోదైన పిటిషన్లను సుప్రీం కు తెప్పించుకోవాలంటూ కేంద్రం ఢిల్లీలో సుప్రీంను ఆశ్రయించిన తీరు ఇవన్నీ వెరసి.. కేంద్రానికి హైకోర్టు అక్షింతలు తప్పకపోవచ్చునని భావిస్తున్నారు.

Similar News