మైండ్ గేమ్ మొదలు పెట్టిన జగన్ ...!

Update: 2018-01-23 05:30 GMT

ప్రత్యేక హోదా ఇస్తే బిజెపితో రాబోయే ఎన్నికల్లో కలిసి ప్రయాణిస్తామని వైసిపి అధినేత జగన్ తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా జగన్ ఈ జవాబు ఇచ్చినప్పటికీ ఇది టిడిపి తో మైండ్ గేమ్ అంటున్నారు విశ్లేషకులు. విభజన అనంతరం ఏపీ అభివృద్ధికి బిజెపి టిడిపి జంట ఖచ్చితంగా మేలు చేస్తుందనే ప్రజలు ఓట్ల వర్షం కురిపించారు. ఆ తరువాత రెండు పార్టీలు తీరు ఎలా ఉందో విభజన చట్టం అమలు తీరు సమస్యల పరిష్కారం ఎంతవరకు చేపట్టారు అన్నది అందరికి తెలిసిందే. ఎన్డీయే సర్కార్ దాదాపుగా నాలుగు ఏళ్ళు సమీపిస్తున్నా ఏపీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుంది.

రెండు పార్టీలను ఇరుకున పెట్టిన వ్యాఖ్యలు ....

జగన్ చేసిన వ్యాఖ్యల కారణంగా బిజెపి, టిడిపిలు ఇరుకున పెట్టేవే. హోదా అటకెక్కిన అంశం దాని స్థానంలో ప్యాకేజి అని రెండు పార్టీలు ప్రకటించాయి. దానికి చట్టబద్ధత అంటూ చట్టంలో పెట్టిన కీలక అంశాలనే చట్టం చేశామని చిత్రంగా పేర్కొన్నారు. కాలం గడిచే కొద్ది ప్యాకేజి కూడా అమలు కావడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా వ్యాఖ్యానించే పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పరిగణలోనికి తీసుకునే జగన్ తాజా వ్యాఖ్యలు చేశారంటున్న విశ్లేషకులు. ఈ వ్యాఖ్యలు టిడిపి ని ఆత్మావలోకనం చేసుకోవాలిసిన స్థితికి చేర్చాయి. బిజెపి కి జగన్ వ్యాఖ్యలతో ఇబ్బంది లేకపోయినా టిడిపికి మాత్రం సమాధానం చెప్పాలిసిన పరిస్థితి ఏర్పడింది. కేసుల కోసమే జగన్ ఈ వ్యాఖ్యలు చేసి బిజెపితో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే వాదన టిడిపి తేవడం తప్ప సూటిగా జవాబు చెప్పుకోలేని దుస్థితి. సో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు జగన్ జాతీయ మీడియా ముందు చెప్పిన వ్యాఖ్యలు టిడిపి బిజెపిని గుక్కతిప్పుకోలేకుండా చేసి డిఫెన్స్ లో పడేయడం విశేషం.

Similar News