మేడారం రైతులది వింత గాధ...కాదు...కాదు..బాధ. మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఈ జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గిరిజనజాతర కాంగంతో జాతర సమయంలో మేడారం జనసంద్రమై పోతుంది. మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు, పాలకులు అక్కడి రైతుల గోడును మాత్రం పట్టించుకోవడం లేదు. మేడారం జాతర కోసం చుట్టు పక్కల దాదాపు మూడు వేల ఎకరాల్లో అధికారులు వివిధ ఏర్పాట్లు చేస్తారు. వన దేవతలను సందర్శించుకోవడానికి కోట్లాది మంది మేడారం బాట పడుతుండటంతో ఏడాది కేడాది భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
యాసంగి పంటకు దూరం...
అయితే ఇక్కడ మూడు వేల ఎకరాల్లో రైతులు మేడారం జాతర కారణంగా యాసంగి పంటను వేయడం లేదు. ఒకవేళ పంట వేస్తే భక్తులు ఇబ్బంది పడతారని గత కొన్నేళ్లుగా రైతులే స్వచ్ఛందంగా యాసంగి పంటకు హాలిడే ఇచ్చుకుంటూ వస్తున్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా ఈ మూడు వేల ఎకరాల్లో పంట వేయలేని పరిస్థితి. ఎందుకంటే మేడారం జాతర కోసం మూడు నెలల నుంచే ఏర్పాట్లను అధికారులు ప్రారంభిస్తారు. విద్యుత్తు, టెలిఫోన్, రోడ్ల నిర్మాణం కోసం మూడు నెలల నుంచే పనులు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో వారు పంట వేసినా అధికారులు వాటిని తొలగిస్తారు. అందుకోసమే వారు స్వచ్ఛందంగా, భక్తులకు ఆటంకం కలగకూడదని యాసంగి పంటకు రైతులు దూరంగా ఉంటూ వస్తున్నారు.
పరిహారం ఏదీ?
అయితే తాము పంట నష్టపోతున్నామని ఇందుకు తమకు పరిహారం ఇప్పించాలని గత కొన్నేళ్లుగా రైతులు అధికారులను వేడుకున్నా కరుణించడం లేదు. ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. తాము జాతర కోసం పంటను వదులుకుంటున్నా పరిహారం ఎందుకివ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జాతర జరిగిన సమయంలో ఆ మూడు వేల ఎకరాల్లో అక్కడే గుడారాలు వేసుకుని భక్తులు ఉంటారు. అక్కడే బోజన ఏర్పాట్లుచేసుకుంటారు. దీనివల్ల తమ పొలం పాడయిపోతుందంటున్నారు. జాతర అయిపోయిన తర్వాత పొల్లాల్లో మిగిలిన వ్యర్థాలను తొలగించాలంటే కూలీలను పెట్టుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, మాంసం ముక్కలు, మందుబాటిళ్లను పొలాల నుంచి తొలగించడానికి తమకు వేలల్లో ఖర్చవుతుందని చెబుతున్నారు. అయితే ఇవన్నీ పట్టా, అసైన్డ్ భూములు కావడంతో తాము పరిహారం ఇవ్వలేమంటున్నారు అధికారులు. ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటే చూస్తామంటున్నారు. మొత్తం మీద వనదేవతల జాతరలో అన్నదాతలకు ఎంత కష్టమొచ్చిందన్న సంగతిని అధికారులు పట్టించుకోక పోవడం విచారకరం.