మెత్తబడ్డ సోము : లేఖాస్త్రాల్లోకి దిగాడా?

Update: 2016-10-31 14:18 GMT

తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబును వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ లాంటి భాజపా దిగ్గజాలు మొత్తం పదేపదే కీర్తిస్తూ ఉండవచ్చు గాక.. ఆయనను మించిన పరిపాలన దురంధరుడు లేనేలేడని కితాబులు ఇస్తూ ఉండవచ్చు గాక.. కానీ ఏపీలో చంద్రబాబు నాయుడుకు కంటిమీద కునుకు లేకుండా చేసిన భాజపా నాయకుడు ఒకరున్నారు. ఆయనే సోము వీర్రాజు. సోము వీర్రాజు ఎడా పెడా ప్రెస్ మీట్ లు పెట్టి చంద్రబాబునాయుడు పరిపాలన గురించి ప్రతిపక్షాల కంటె దారుణంగా విమర్శలు గుప్పించిన రోజులు ప్రజలకు ఇంకా గుర్తున్నాయి. అయితే కారణాలు తెలియదు గానీ.. కొంతకాలంగా ఆయన సైలెంట్ అయిపోయారు. తాజాగా కేవలం విన్నపాలు మాత్రం చేసుకుంటూ చంద్రబాబునాయుడుకు లేఖలు రాసుకునే స్థితికి వచ్చినట్లు తెలుస్తోంది.

తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి హిందూ ధర్మప్రచారానికి నిధులు విడుదల అయ్యేలా చూడాలంటూ సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో మరికొన్ని ప్రధాన కేంద్రాల్లో కూడా వేదపాఠశాలలు చేయాలని ఆయన కోరారు. అలాగే ఒంటిమిట్ట దేవాలయం గురించి కూడా ప్రకటించిన 100 కోట్లు విడుదల చేసి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

సోము వీర్రాజు కోరికల పర్వం సంగతి పరవాలేదు కానీ... ఆయన చంద్రబాబును నిలదీయడం స్థానే, లేఖల్లోకి దిగడమే ఆశ్చర్యంగా ఉంది. ఇది భాజపా హైకమాండ్ మందలించడం వలన వచ్చిన మార్పో, సోము వీర్రాజుకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి రాకుండా చంద్రబాబు బ్రేకులు వేసిన ఫలితమో తెలియదు మరి!!

Similar News