పుష్కర కాలంగా భాగ్యనగర్ వాసులు ఎదురు చూసిన మెట్రో రానే వచ్చింది. పూర్తి స్థాయిలో మెట్రో రైళ్లు నడవకపోయినా, నడుస్తున్న మార్గంలో కొన్ని ప్రధాన కష్టాలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సమస్య ప్రయాణికులను వెంటాడుతుంది. కొన్ని చోట్ల ఇంకా పూర్తి స్థాయిలో పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవడంతో తాము వెళ్ళి వచ్చే వరకు ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలు ఉంచుతారో పట్టుకుపోతారో అన్న ఆందోళన ప్రయాణికులను వెంటాడుతుంది. టాయిలెట్లు, మంచినీటి సమస్య పరిష్కరించాలని కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
స్మార్ట్ కార్డులు ఏడిపిస్తున్నాయి ....
కొన్ని చోట్ల స్మార్ట్ కార్డు లు సక్రమంగా పనిచేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. టి సవారి యాప్ అప్లికేషన్ సక్రమంగా పనిచేయడం లేదని అంటున్నారు. అమీర్ పేట స్టేషన్ లో సైన్ బోర్డ్స్ లేక కొంత ఇబ్బంది పడుతున్నారు. మెట్రో లో ప్రయాణించే వారు కనెక్టివిటీ ఉండేలా ఓలా ఉబర్ లతో ప్రత్యేక ఏర్పాటు ఉండేలా చూడాలని సూచిస్తున్నారు. ఎస్క లెటర్ లే కాకుండా లిఫ్ట్ సౌకర్యాన్ని కోరుతున్నారు పెద్ద వయస్సు వారు. ఇక మెట్రో చార్జీల బాదుడుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, బెంగుళూరు నగర మెట్రోల కన్నా అధికంగా వున్న ఈ చార్జీలు తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరి ఎప్పటిలోగా ఈ సమస్యలకు హైదరాబాద్ మెట్రో పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.