అవును! మెగాస్టార్ ఫ్యామిలీ లోని హీరోలు, కుటుంబం అంతా అటు చిరంజీవికి ఇటు పవన్‌కి ఎవరికి మద్దతు ఇస్తుంది? ఎవరి పక్షాన నిలబడుతుంది? ఎవరికి జై కొడుతుంది? ఇప్పుడు ఈ టాపిక్‌పైనే చర్చ నడుస్తోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సూత్రం. ప్రస్తుత రోజుల్లో ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో వారి సపోర్ట్ లేకుండా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నేటి రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ అధినేత, ఉద్యమ సారధి కేసీఆర్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ విపక్ష నేత వైసీపీ అధినేత జగన్ వరకు అందరూ కుటుంబ సభ్యుల సపోర్టును ఏదో ఒక రూపంలో స్వాగతిస్తున్న వారే. వారిని తమ వెంటేసుకుని తిరుగుతున్న వారే. తెలంగాణ సీఎం కేసీఆర్ విషయానికి వస్తే.. ఆయన ఏకంగా కుటుంబాన్ని కేబినెట్‌లో పెట్టుకున్నారు.
అందరూ తమ కుటుంబ సభ్యులను...
ఏపీ సీఎం చంద్రబాబు సైతం కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేది లేదని అంటూనే తన కుమారుడిని తన చెంతనే చేర్చుకుని మంత్రి పదవి ఇచ్చి, ప్రభుత్వంలో బాధ్యుడిని చేయడంతోపాటు పలు కీలక అంశాలను అప్పగించారు. ఇక, వైసీపీ అధినేత వీలును బట్టి.. తల్లిని, చెల్లిని కూడా రంగంలోకి దింపుతున్నాడు. ఇలా, రాజకీయాలకు ఎవరూ వ్యతిరేకం కాదనే రీతిలో ఈ పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. ఇక, ఇప్పుడు పవన్ పార్టీ తెరమీదకి వచ్చింది. ఈయన విషయానికి వస్తే.. విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ సభ్యులు అందరూ కూడా పవన్‌కు వ్యతిరేకం కాదు. అయితే, అదేసమయలో పవన్ సొంత పార్టీ పెట్టుకుంటే.. ఆయన అన్నచిరంజీవి ఏకంగా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి.. తాను కాంగ్రెస్ సీనియర్ నేతగా చలామణి అవుతున్నాడు.
మరి వీరి మద్దతు ఎవరికి?
మరి ఇప్పుడు మెగా కుటుంబ సభ్యులు పవన్ కు మద్దతివ్వాలా? లేదా చిరుకు మద్దతివ్వాలా? అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. . పవన్ తెలంగాణలో యాత్ర ప్రారంభించిన సందర్భాన్ని బట్టి.. మెగా ఫ్యామిలీ హీరోలు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటిస్తూ ట్వీట్లు, ఫేస్ బుక్ పోస్ట్ లు చేశారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఫేస్ బుక్ లో.- ” నేను ఓ భారతీయుడిని.. నా జన్మ భూమిని రక్షించుకొనే భాద్యత నా పై ఉంది అన్న పవన్ కళ్యాణ్ కామెంట్ తో పాటు.. బాబాయ్ మీకు అంతా శుభం కలగాలని… కోరుకొంటున్నా.. జై జనసేన” అంటూ పోస్ట్ చేశారు. రాం చరణ్ భార్య ఉపాసన కూడా ఈ పోస్ట్ ని రీ-ట్వీట్ చేశారు.
మీ వెంటే మేమంటున్న....
ఇక వరుణ్ తేజ్ ట్విట్టర్ లో “ఆల్ ద బెస్ట్ బాబాయ్, మీకు మరింత శక్తి కలగాలి, జై జనసేన” అని ట్వీట్ చేస్తే, మెగా ఫ్యామిలీ హీరో – సాయి ధరం తేజ్ కూడా “మీ వెంటే మేము, జై జన సేన” అంటూ ట్వీట్ చేశారు. అంతా బాగానే ఉంది. చిరు బావమరిది అల్లు కాంపౌండ్ నుంచి గాని, ఆయన తనయులు హీరోలు అయిన అల్లు అర్జున్, శిరీష్ మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉంటే 2019 నాటికి పవన్ తన పార్టీ.. ఏ కేసీఆర్‌కో.. చంద్రబాబుకో మద్దతిస్తుందని ప్రకటిస్తే.. పరిస్థితి ఏంటి? చిరంజీవి కాంగ్రెస్ నుంచి బయటకు రాడు కనుక.. ఇద్దరు అన్నదమ్ముల్లో ఫ్యామిలీ ఏపక్షం నిలబడుతుంది? ఎవరికి ఓటేస్తుంది? అన్నది ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తున్న విషయం. పైకి పవన్ అన్నా బయటకు వస్తే మెగా హీరోలందరి ఓటు చిరు పార్టీవైపే అంటున్నారు విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.