మూడున్నరేళ్ల అజ్ఞాత‌వాసి... జ‌నంలోకి మాజీ మంత్రి...!

Update: 2018-01-03 13:30 GMT

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ఆ మాజీ మంత్రి మూడున్న‌రేళ్లుగా అజ్ఞాతంలో అజ్ఞాత‌వాసిలా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎట్టకేల‌కు ఇన్ని రోజుల త‌ర్వాత భ‌య‌ట‌కు రావ‌డం రాజ‌కీయంగా మ‌ళ్లీ సెగ‌లు రేపుతోంది. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత తెలంగాణ‌కు తొలి పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితులైన పొన్నాల ల‌క్ష్మ‌య్య గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌గామ నుంచి మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో పోటీ చేసి ఓడిపోయారు. జ‌న‌గామ నుంచి ఆయ‌న టీఆర్ఎస్ అభ్య‌ర్థి ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి చేతిలో 36 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

నేడు అడుగుపెట్టిన పొన్నాల....

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత పొన్నాల ప‌ద‌వి పోవ‌డంతో రాజ‌కీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న రాజ‌కీయంగా యాక్టివ్‌గా లేరు. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల జ‌రిగిన మూడున్న‌రేళ్ల త‌ర్వాత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మ‌య్య జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టారు. కాంగ్ర‌స్ ప్ర‌భుత్వంలో భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రిగా ప‌నిచేసిన పొన్నాల గ‌త ఎన్నిక‌ల్లో యాద‌గిరిరెడ్డి చేతిలో ఓడిన‌ప్ప‌టి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేదు. మ‌ళ్లీ సాధార‌ణ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్టారు. బుధ‌వారం జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలోని ఉమ్మ‌డి న‌ర్మెట మండ‌లంలో కార్య‌క‌ర్త‌ల‌తో భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

రీఎంట్రీ గ్రాండ్ గా....

ఈ ర్యాలీ అలా ఇలా జ‌ర‌గ‌లేదు. సుమారు మూడువేల మంది కార్య‌క‌ర్త‌లు ఈ ర్యాలీలో పాల్గొన‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి బ‌తుక‌మ్మ కుంట భూ ఆక్ర‌మ‌ణ వివాదంలో చిక్కుకోవ‌డం, రిజ‌ర్వేష‌న్ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం తదిత‌ర అంశాల‌తో ఆయ‌న‌పై స్థానికంగా వ్య‌తిరేక‌త ఏర్ప‌డుతోంది. ఈసారి టికెట్ ద‌క్కేది కూడా అనుమాన‌మేన‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ పొన్నాల నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌డం కార్య‌క‌ర్త‌ల్లో కొంత ఉత్సాహం వ‌చ్చింది. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో పొన్నాల నిల‌బ‌డ‌తారా..? లేక ఆయ‌న కోడ‌లు పొన్నాల వైశాలిని బ‌రిలో నిలుపుతారా..? అన్న‌ది మ‌రికొంత కాలం గ‌డిస్తేనే కాని స్ప‌ష్టం అవుతుంది. నియోజ‌క‌వ‌ర్గంలో పొన్నాల రీ ఎంట్రీ ఇవ్వ‌డం, ఇటు టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై తీవ్ర వ్య‌తిరేక‌త ఉండ‌డంతో ఈ సారి జ‌న‌గామ‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థికి గ‌ట్టి పోటీ ఉంటుంద‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న హ‌యాంలోనే దేవాదుల కాల్వ‌లు పూర్త‌య్యాయ‌ని పొన్నాల ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తుండ‌డం కొస‌మెరుపు. ఇక మ‌రో విష‌యం ఏంటంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొన్నాల తాను జ‌న‌గామ నుంచి పోటీ చేసి ఆయ‌న కోడ‌లు వైశాలిని భువ‌న‌గిరి ఎంపీ సీటు నుంచి పోటీ చేయించే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

కోడలిని పోటీ చేయిస్తారా?

అక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసిన రాజ్‌గోపాల్‌రెడ్డి ఈ సారి మునుగోడు నుంచి ఎంపీగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. దీంతో పొన్నాల త‌న కోడ‌లిని అక్క‌డి నుంచి ఎంపీగా పోటీ చేయించాల‌ని చూస్తున్నార‌ట‌. మ‌రి పొన్నాల ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తాయో ? ఇక వైశాలి గ‌తంలో 2008 ఉప ఎన్నిక‌ల్లో అప్ప‌టి చేర్యాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు.

Similar News