మొహాలీ మరో ఘనవిజయాన్ని అందించింది. నాలుగోరోజు ఆట ఇంకా ముగియక ముందే.. మ్యాచ్ ముగిసిపోయింది. కొహ్లి సేన చిరస్మరణీయమైన విజయాన్ని ఒక రోజు ఆట మిగిలి ఉండగానే చేజక్కించుకుంది. చివరి సెషన్ కుముందుగానే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ కు తెరదించేసిన భారత్, 103 పరుగులు అతి చిన్న లక్ష్యాన్ని అధిగమించడానికి అయిదోరోజు ఆట వరకు ఆగలేకపోయింది. రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
8ఏళ్ల తరువాత భారత జట్టులోకి వచ్చిన పార్థివ్ పటేల్ ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 100కు పైగా పరుగులు సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసిన పార్థివ్, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో భారత్ వేగవంతమైన విజయంలో కీలక భూమిక పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కొహ్లి తన విశ్వరూపం ప్రదర్శించాల్సిన అవసరం లేకుండానే మ్యాచ్ ముగిసిపోయింది.
తొలి ఇన్నింగ్స్ లో భారత్ తరఫున కొహ్లి 62 పరుగులు చేసినా ఆ సమయానికి భారత్ గడ్డు పరిస్థితిలోనే ఉంది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బౌలర్లు అశ్విన్, జడేజా పాతుకుపోయి.. స్కోరును గౌరవప్రదమైన స్థానానికి తీసుకువెళ్లారు. అశ్విన్ 72, జడేజా 90 పరుగులు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 417 పరుగులతో మంచి ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ కూడా పేలవంగానే సాగింది. 236 పరుగులకు ఆలౌట్ అయ్యారు.
19 ఏళ్ల కుర్రాడిగా ఇంగ్లాండ్ తరఫున ఓపెనర్ గా ఈ టెస్టు సిరీస్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన హమీద్ తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్ లో మంచి స్కోరుతో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టుతో పాటూ, మొహాలీ మొదటి ఇన్నింగ్స్ లో విఫలం అవడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో
8వ స్థానానికి నెట్టారు. అయితే ఆ స్థానంలో వచ్చినా కూడా.. తన ఆటలో పదును ఉన్నదని ఈ కుర్రాడు నిరూపించుకున్నాడు. రూట్ తరువాత.. 59 పరుగులతో ఇంగ్లాండ్ జట్టులో టాప్ స్కోరర్ అతనే కావడం విశేషం.
మొత్తానికి మొహాలీ విజయంతో 2-0 తేడాతో అయిదు టెస్టుల సిరీస్ లో భారత్ పైచేయి సాధించింది.