కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు మరో అల్టిమేటం ఇచ్చారు. కాపు రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రభుత్వం తర్వాత చేతులు దులుపుకుంటుందని భావించిన ముద్రగడ ఇందులో ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కొత్త ఎత్తుగడకు దిగారు. మార్చి 31వ తేదీలోపు కాపు రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలుకాకుంటే మరోసారి ఆందోళన చేపడతామని ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. 13 జిల్లాల కాపు జేఏసీ సమావేశంలో ముద్రగడ ఈ వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి డిసెంబర్ 6వ తేదీ వరకూ కాపు రిజర్వేషన్లపై గతంలో ముద్రగడ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈలోపే మంజునాధ కమిషన్ ఛైర్మన్ నివేదిక ఇవ్వకపోయినప్పటికీ సభ్యుల నివేదికతో హడావిడిగా కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ మంత్రివర్గం ఆమోదించింది.
మళ్లీ డెడ్ లైన్.....
ఆ వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపారు. అయితే కేంద్రం వద్దకు పంపడమేతన బాధ్యతగా చంద్రబాబు ఉన్నారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. కేంద్రానికి నివేదిక పంపినందువల్ల ఉపయోగం లేదనికాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తేనే తమ డిమాండ్ నెరవేరుతుందన్నారు. అయితే కేంద్రం నుంచి రిజర్వేషన్ల విషయంలో సానుకూలత వస్తుందని కాపులు సయితం విశ్వసించడం లేదు. చంద్రబాబు కూడా పోలవరం ప్రాజెక్టు పైన పెట్టిన దృష్టి మిగిలిన అంశాలపై పెట్టడంలేదు. చంద్రబాబు కు గత ఒకటన్నర ఏడాదిగా మోడీ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల అమలు కోసం ముద్రగడ చంద్రబాబుకు మరో డెడ్ లైన్ విధించారు. కాపులకు రిజర్వేషన్ల ఫలం అందితేనే ఆ హామీ అమలయినట్లన్నది ముద్రగడ వాదన. దీంతో మరోసారి చంద్రబాబును ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముద్రగడ.