ముందుచూపు ఈయనకు అచ్చొచ్చిందే!

Update: 2017-10-23 18:29 GMT

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకున్నారు షింజో అబే. జపాన్ లో జరిగిన తాజా ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రభంజనమే సృష్టించింది. జపాన్ పీఠాన్ని షింజో అబే మరోసారి కైవసం చేసుకున్నారు. జపాన్ పార్లమెంటు ఎన్నికల్లో షింజో అబే నాయకత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ కూటమి విజయం సాధించింది. జపాన్ పార్లమెంటులో మొత్తం 465 స్థానాలుండగా, షింజో అబే పార్టీ 312 స్థానాలను గెలుచుకుంది. మేజిక్ ఫిగర్ ను కూడా దాటేసింది. అధికారం చేపట్టాలంటే 310 స్థానాలు అవసరం. మొత్తం మీద షింజో అబే ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి తన సత్తాను చాటుకున్నారు. వాస్తవానికి వచ్చే ఏడాది డిసెంబరు వరకూ షింజో అబే ప్రభుత్వానికి గడువు ఉంది. కాని మారిన పరిస్థితులకు అనుగుణంగా ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయారు. ఇటు రాజకీయ సమీకరణాలు, అటు ఇతర దేశాలతో ముప్పు తదితర అంశాలను తనకు కలిసి వస్తాయని భావించిన షింజో అబే ముందు చూపుతోనే ముందస్తుకు వెళ్లారు.

కలిసొచ్చిన అంశాలు.....

ఉత్తర కొరియా వరుస క్షిపణుల ప్రయోగాల నేపథ్యంలో జపాన్ అంతటా ఆందోళన నెలకొని ఉంది. జపాన్ మీదుగానే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ జపాన్ ప్రజల్లో ఉంది. ఇది షింజో అబేకు కలిసి వచ్చింది. ప్రభుత్వం బలంగా ఉంటేనే ఉత్తర కొరియాను సమర్థంగా ఎదుర్కొనగలమని జపాన్ ప్రజలూ భావించారు. అలాగే విపక్షాల్లో కూడా ఐక్యత లోపించింది. ఈ నేపథ్యంలోనే షింజో అబే కొన్ని సర్వేలు చేయించుకుని తనకు అనుకూలంగా ఉందని తేలడంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. మొత్తం మీద విజయం సాధించి లిబరేషన్ డెమొక్రటిక్ పార్టీ మరోసారి జపాన్ పీఠాన్ని చేజిక్కించుకుంది. షింజో అబేకి ప్రపంచ వ్యాప్తంగా దేశాధినేతలంతా శుభాకాంక్షలు చెప్పారు. జపాన్ అభివృద్ది పథంలో నడుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Similar News