మీరు సరే..వీళ్లసంగతి ఏంటి కేటీఆర్ సారూ....

Update: 2017-10-15 09:30 GMT

తెలంగాణ వ్యాప్తంగా తన ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ బహిరంగంగా చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం ఫ్లెక్సీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టిన వారి నుంచి జరిమానాకూడా వసూలు చేస్తున్నారు. కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా కొందరు కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజెన్లను కేటీఆర్ కు సూటిగా ప్రశ్నలు సంధించారు. రూలింగ్ పార్టీకి ఫ్లెక్సీలపై నిషేధం వర్తించదా? అని ప్రశ్నించడంతో వెంటనే కేటీఆర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ కు వెంటనే వాటిని తొలగించాలని ట్వీట్ చేశారు. అంతేకాదు ఫ్లెక్సీలు కట్టిన వారికి జరిమానా విధించాలని ఆదేశించారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే... ముఖ్యమంత్రి తనయుడే తన ఫ్లెక్సీలను తొలగించమని చెబుతుంటే... ఖమ్మం జిల్లా ఇల్లందులో మాత్రం ఈ ఫ్లెక్సీల రగడ ఇంకా చల్లార లేదు.

ఇల్లందు ఫ్లెక్సీ గొడవలో.....

సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఆ ప్రాంత పర్యటనకు వస్తున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీల ఫ్లెక్సీలను టీఆర్ఎస్ నేతలు పెద్దయెత్తున కట్టారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ రవిబాబు వెంటనే వాటిని తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది తొలగించడంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ నేతలు కమిషనర్ రవిబాబుపై దాడి చేశారు. దీంతో కమిషనర్ రవిబాబు టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. తమపైనే కమిషనర్ దాడి చేశారని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ కేసు పెట్టారు. అయితే సింగరేణి ఎన్నికలు ముగిశాయి. కాని ఇప్పటి వరకూ తనపై దాడిచేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కమిషనర్ రవిబాబు పోలీసు అధికారులను ప్రశ్నించారు. దీనికి పోలీసు అధికారులు నీళ్లు నమిలారు. స్థానిక ఎమ్మెల్యే వత్తిడితోనే పోలీసులు కేసు పెట్టడం లేదని సమాచారం. మరోవైపు రవిబాబుకు మద్దతుగా ఇల్లందులో దళిత సంఘాలు ఆందోళనకూ దిగాయి. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలంటూ నిరసనలు చేశారు. అయినా పోలీసులు ఇంతవరకూ కమిషనర్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయలేదు. మరి దీనిసంగతి ఏంటి కేసీఆర్ సారూ... మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ పై దాడి చేసిన వారిని వెనకేసుకొస్తున్న ప్రజాప్రతినిధులను ఎందుకు ప్రశ్నించడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

Similar News