మీరు మారకుంటే...నేనే మారుస్తా...!

Update: 2018-01-30 12:30 GMT

ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలీదు.. ఎప్పుడొచ్చినా సిద్ధం కావాలి. అయితే చంద్రబాబు సర్వేలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నట్లు తేలింది. ఈ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందంటే... వారికి టిక్కెట్ ఇస్తే కనీస ఓట్లు కూడా రానంతగా. గత కొన్నిరోజుల నుంచి ఈ నలభై మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు హెచ్చరిస్తూనే ఉన్నారు. వారి పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ లు ఇచ్చారు. ఎలా పనిచేయాలో అనేక సమావేశాల్లో చెప్పారు. శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే వీరిలో ఏమాత్రం మార్పురాలేదని మరోసారి గ్రహించిన చంద్రబాబు ఈ రోజు జరిగిన సమావేశంలో ఒకింత ఫైర్ అయ్యారట.

ప్రభుత్వంపై సానుకూలత....

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఈరోజు అమరావతిలో జరిగింది. అయితే ఎమ్మెల్యేల పనితీరు, ప్రవర్తనపై చంద్రబాబు క్లాసు పీకారంటున్నారు. ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు నేతలు విఫలమయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్యేలు మారితే అంతా మార్పు వస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై పూర్తి స్థాయి సానుకూలత ఉందని చంద్రబాబు సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను పార్టీ పట్ల అనుకూలంగా మార్చుకోవడంలో నేతలు ఫెయిలవుతున్నారన్నారు.

పార్టీపై మాత్రం.....

అంతేకాదు కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు హైదరాబాద్ లోనే నేటికీ వ్యాపారాలపై దృష్టిపెట్టి నియోజకవర్గాలను పట్టించుకోవడం మానేశారని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక టీడీపీ ఎమ్మెల్యేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ఆయనకు... తన కుటుంబ సభ్యులు చెబితే టిక్కెట్ ఇచ్చానని, ఆయన మాత్రం నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని తన వద్ద సమాచారం ఉందని ఆయన సమావేశంలోనే చెప్పడం విశేషం. అందుకోసం ఇక నెలలో నాలుగైదు రోజులు జిల్లా ఇన్ ఛార్జిమంత్రులు నియోజకవర్గాల్లో పార్టీపై దృష్టి పెట్టాలని కోరారు. డిసెంబర్ లో తాను సర్వే చేయిస్తే ప్రభుత్వం పై 57 శాతం సంతృప్తి ఉందని, జనవరిలో అది 62 శాతానికి పెరిగిందని, దీనిని మార్చి నెల నాటికి 80 శాతానికి తీసుకుపోయేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పనులన్నీ చేస్తున్నామని, మన ప్రవర్తనలోనే మార్పు రావాలని నేతలకు బాబు గట్టిగానే చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోక పోతే వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో అభ్యర్థిని తానే మారుస్తానని హెచ్చరించారు.

Similar News