‘భాజపాను గెలిపిస్తే విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకువచ్చి.. దేశంలోని ప్రజలందరికీ ఒక్కొక్కరికి 15 లక్షల వంతున వారి ఖాతాల్లో జమ చేస్తా’నని నరేంద్రమోదీ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశమంతా హామీలు ఇచ్చారు. ప్రధాని అయిన తర్వాత ఇటీవలి కాలంలోనే విపక్షాలు ఆయనను అచ్చంగా ఇదే పాయింటు మీద పదేపదే నిలదీశాయి కూడా. విదేశాల నుంచి నల్లడబ్బు తెప్పించి తలా 15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైంది అంటూ వెటకారం చేశాయి. 15 లక్షల సంగతి మాటేమోగానీ.. ప్రస్తుతం నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో భాగంగా.. నల్ల కుబేరులు - పేదల ఖాతాల్లో జమ చేసుకుంటున్న రెండున్నర లక్షల రూపాయలను తిరిగి ఇవ్వవద్దంటూ మోదీ పిలుపు ఇస్తున్నారు.
యూపీలో శనివారం నాడు ఓ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ .. ప్రజలకు ఈ భరోసా ఇవ్వడం విశేషం. ‘మీ జన్‌ధన్ ఖాతాల్లో నల్లకుబేరులు తమ డబ్బును అక్రమంగా వేసుకుని ఉంటే, దాన్ని తిరిగి వారికి ఇవ్వద్దు. మీ జన్‌ధన్ ఖాతాలనుంచి ఒక్క రూపాయి కూడా విత్ డ్రా చేయవద్దు. మిమ్మల్ని ఎవరేం చేస్తారో చూస్తా.. వారు గనుక వచ్చి డబ్బులడిగారంటే.. ‘మోదీకి లెటర్రాస్తా’ అని బెదిరించండి. ఎవరేం చేస్తారో చూస్తా.. అలాంటి వారినందరినీ కటకటాల వెనక్కి పంపుతా అంటూ మోదీ ప్రసంగంలో భాగంగా అన్నారు.
నోట్ల రద్దు తరవాత.. ప్రజల వద్ద అనౌకౌంటెడ్ సొమ్ములుంటే.. దానిని ప్రజలు తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చునని... 2.5 లక్షల వరకు వేసుకునే సొమ్ములకు వివరాలు అడగబోమని, అంతకు మించి భారీ మొత్తాలు డిపాజిట్ అయితే ఐటీ వారికి వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. నల్లకుబేరులు తమ డబ్బును తమకు పరిచయం ఉన్న వివిధ వ్యక్తుల ఖాతాల్లో ఇలా 2.5 లక్షల వంతున వేసేసుకున్నారు. ఇందులో జన్‌ధన్ ఖాతాలూ ఉన్నాయి. ఇలా ఆ బ్యాంకు ఖాతాలను వాడుకుంటున్నారని అర్థమైన కేంద్రం, జన్‌ధన్ ఖాతాల్లో 50 వేలకు మించి వేస్తే లెక్కలు అడుగుతాం అంటూ నిబంధన పెట్టింది.
తీరా ఇప్పుడు అలా ఖాతాల్లో పడిన డబ్బును తిరిగి ఇవ్వకుండా మీరే తీసేసుకోండి అంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పేస్తున్నారు.
అయినా ఈ దేశంలో ఎవరి డబ్బును ఎవరు అనుభవించడానికి ఎవరు హామీ ఇచ్చేస్తున్నారో అర్థం కాకుండా పోతోంది. అలా డిపాజిట్ లు అయినది నల్లడబ్బే అని తేలితే.. దాన్ని సర్కారు రాబట్టడానికి నిబంధనలు తయారు చేయాలి గానీ.. ప్రజలతో మీరే తేరగా తీసేసుకోండి అన్నట్లుగా నరేంద్రమోడీ అనడం.. ఎన్నికల ప్రచార గిమ్మిక్కేనా? సీరియస్ హామీనా? అని సందేహం కలుగుతోంది.