మిలిటెంట్ వ్యూహాల్లో సిద్ధహస్తుడు మంద కృష్ణ ...!.

Update: 2017-12-18 02:30 GMT

ఒక పక్క ప్రపంచ తెలుగు మహాసభలతో భాగ్యనగరం సందడి సందడిగా వుంది. అలాంటి సమయంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మరోసారి మిలిటెంట్ వ్యూహం ప్రవేశపెట్టారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి సంస్మరణ సభ కాస్తా భాగ్యనగర్ భగ్గుమనేలా చేసింది. సభలో ఒక్కసారిగా ట్యాంక్ బండ్ ముట్టడికి పిలుపునిచ్చారు మందా కృష్ణ . ఊహించని ఈ పరిణామాలతో తక్కువ మందే వున్న పోలీస్ బందోబస్తు తేరుకునేలోపే విధ్వంస కాండ సాగిపోయింది. వేలాదిమంది దండోరా ఉద్యమకారులు తెలుగు మహాసభల స్వాగత ఏర్పాట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు చించి పడేశారు. భయానక పరిస్థితులు ఏర్పడటంతో యుద్హప్రాతిపదికన ట్రాఫిక్ మళ్లించి ప్రజలను రక్షించారు పోలీసులు. సభలో ఉద్యమనేత పిలుపు ఇచ్చి ట్యాంక్ బండ్ పై విధ్వంసం తరువాత మందా కృష్ణను అరెస్ట్ చేయడానికి సమయం పట్టింది ఖాకీలకు.

తొలినుంచి అంతు చిక్కని కృష్ణ వ్యూహాలు ...

మందా కృష్ణ గతంలో సాగించిన ఉద్యమాలన్ని చాలా వరకు హింసాత్మక పరిస్థితికి దారితీసాయి. ఆయనకు మాత్రమే తెలిసేలా ముందుగా వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడం కృష్ణ కు అలవాటు. గతంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు, అమరావతి లో ఆయన సృష్ట్టించిన భీభత్సం పోరాట పంధా అన్ని ఇదే తీరులో సాగేవి. తాజాగా కూడా సైలెంట్ గా సభ మొదలు పెట్టి దాన్ని వ్యూహాత్మకంగా వైలెంట్ చేసేసే కృష్ణ తీరు విభిన్నం. అందుకే టి పోలీసులు సైతం మందా వ్యూహాలను అంచనా వేయలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ ముట్టడిపై టి సర్కార్ ఇంటెలిజెన్స్ వర్గాలను తప్పు పట్టింది.

విపక్షాల కుట్ర అన్న బాలరాజు ...

ఃవిశ్వ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుంటే వాటినుంచి అందరి దృష్టిని మరలించేందుకు విపక్షాలు మందా కృష్ణ తో కలిసి కుట్ర పన్నాయని టి ఆర్ ఎస్ ఎమ్యెల్యే బాలరాజు ఆరోపించారు. కేసీఆర్ ఖ్యాతిని బొంద పెట్టడానికే ఈ విధ్వంసానికి దిగారని విమర్శించారు. ఎస్సి వర్గీకరణకు కోసం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నా కావాలనే కృష్ణ హింసాత్మక చర్యలకు దిగి మాదిగ జాతి పరువు తీస్తున్నారని దుయ్యబట్టారు. దీనివెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు బాలరాజు.

Similar News