వైఎస్ జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు పెద్దయెత్తున తరలి వస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను జగన్ కు నివేదిస్తున్నారు. ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్ర ప్రత్తికొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. జగన్ ప్రస్తుతం 125 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఆదివారం జగన్ పాదయాత్రకు విరామమిచ్చారు. ఈస్టర్ పండగ సందర్భంగా ఆయన పాదయాత్రకు విరామమిచ్చి సోమవారం నుంచి యధావిధిగా యాత్రను కొనసాగించనున్నారు.
ఇక్కడ వేడెక్కింది.....
గుంటూరు జిల్లాకు వచ్చే సరికి జగన్ పాదయాత్ర వేడెక్కింది. విమర్శలు, ప్రతివిమర్శలతో పాటు ప్రత్యేక హోదా ఉద్యమం కూడా ఊపందుకుంది. గుంటూరు జిల్లాలోనే జగన్ వైసీపీ ఎంపీలతో సమావేశమై ఆమరణ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ జిల్లాలో చేసిన విమర్శలు మరే జిల్లాలో చేయకపోవడం విశేషం. మంత్రులు, ఎమ్మెల్యేలపై జగన్ విరుచుకు పడుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టేవిధంగా వ్యూహరచన చేస్తున్న జగన్ గుంటూరు మిర్చి ఘాటు చూపిస్తున్నారు.
రాజీనామాలు డ్రామాలంటున్నా.....
వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసిన అనంతరం నేరుగా ఢిల్లీలోని ఏపీ భవన్ కు వెళ్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని జగన్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. రాజీనామాలు డ్రామాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు. రాజీనామాలు చేసినా స్పీకర్ ఆమోదించరని, స్పీకర్ ఆమోదించినా ఎన్నికలు రావని సీఎం రమేష్ జోస్యం చెప్పారు. వైసీపీ నేతలు బీజేపీతో కుమ్మక్కై రాజీనామాల నాటకాలకు తెరలేపుతున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు దీక్షకు వైసీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది.
126వ రోజు పాదయాత్ర షెడ్యూల్....
ఈరోజు జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గం పేరిచర్ల శివారు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి శ్రీనివాస కాలనీకి చేరుకుని తాడికొండ నియోజకవర్గంలో జగన్ పాదయాత్రను ముగిస్తారు. తర్వాత తిరిగి ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశిస్తుంది. తర్వాత వెంగలాయలపాలెం క్రాస్ రోడ్స్, చల్లవారి పాలెం, మీదుగా నల్లపాడు జగన్ పాదయాత్ర చేరుకుంటుంది. నల్లపాడులో జగన్ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి తిరుపతి రెడ్డి నగర్, హౌసింగ్ బోర్డు కాలని, మల్లారెడ్డి నగర్ మీదుగా శ్రీరామ్ నగర్ కు జగన్ చేరుకుంటారు. రాత్రి అక్కడే జగన్ బస చేయనున్నారు.