మారణహోమం ఆగదా?

Update: 2018-02-27 18:29 GMT

సిరియా అట్టుడికిపోతోంది. ప్రభుత్వానికి, తీవ్రవాదాులకు మధ్య జరుగుతున్న దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. సిరియా రాజధాని డమస్కస్ కు అతి సమీపంలో ఉన్న గౌటా నగరంలో ఇప్పుడు రక్తపు మడుగులు కన్పిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ దాడుల్లో దాదాపు 700 మంది పౌరులు ప్రాణాలు వదిలేశారు. గౌటా నగరం మిలిటెంట్ల చేతుల్లో ఉంది. దాన్ని స్వాధీనపర్చుకునేందుకు గత ఐదు రోజుల నుంచి భద్రతా దళాలు దాడులు జరుపుతున్నాయి. రష్యా సిరియా సైనికులకు సహకారం అందిస్తుంది. వైమానిక దాడులు జనావాసాలపై జరుగుతుండటంతో ఇప్పటికే 200 మంది చిన్నారులు మరణించినట్లు అంచనా. 110 మంది మహిళలు మృత్యువాత పడ్డారు.

గౌటా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు....

సిరియాలో మిలిటెంట్లను అన్ని చోట్ల నుంచి ప్రభుత్వం తరిమేసే కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా అనేక ప్రాంతాల నుంచి వారిని పంపించి వేసి ప్రభుత్వం తమ స్వాధీనంలోకి తీసుకుంది. అయితే గౌటా నగరంలో మిలిటెంట్లు తలదాచుకున్నారు. సాధారణ పౌరుల్లా ఉంటూ గౌటా నగారాన్ని గత ఏడాది మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దేశరాజధానికి ఆనుకునే ఉన్న చిన్న పట్టణం కావడంతో సిరియా సైనికులు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత వైమానిక దాడులు చేయాల్సి ఉండగా, నివాస ప్రాంతాల్లోనే దాడులు చేస్తుండటంతో అంతర్జాతీయ సమాజాం అభ్యంతరం పెడుతోంది.

అంతర్జాతీయంగా ఆగ్రహాలు....

తహ్రీర్ ఆల్ షమ్, అల్ రహమాన్ లీజియన్, జైష్ ఆల్ ఇస్లామ్ అనే సంస్థలు గౌటా పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. అయితే ఈ ప్రాంతాన్ని తిరిగి తాము స్వాథీనంలోకి తెచ్చుకోవాలని సిరియా సైనికులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైమానిక దాడులకు దిగుతున్నారు. సిరియాలో జరుగుతున్న మారణహోంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కూడా స్పందించింది. ఈ నెల 25న జరిగిన సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని కోరింది. అయితే రష్యా మాత్రం రోజుకు ఐదు గంటలు మాత్రమే కాల్పులకు విరామం ప్రకటిస్తామని చెప్పడం విశేషం. సిరియాలో జరుగుతున్న మారణకాండపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.

Similar News