బీజేపీని ఎదుర్కొనేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన సమాజ్ వాదీ పార్టీతో చేతులు కలపడం చర్చనీయాంశమైంది. బీజేపీకి ఒకసారి అవకాశమిస్తే ఇక వదిలించుకోవడం కష్టమని భావించిన మాయావతి యూపీ నుంచి బీజేపీని బయటకు పంపాలంటే సమాజ్ వాదీ పార్టీతో దోస్తీయే బెటరని భావించారన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే యూపీలో బీజేపీ సర్కార్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి పాతుకుపోయింది. బీజేపీని చావు దెబ్బతీయడానికి అందరం ఒక్కటవ్వాలన్నది మాయావతి అభిప్రాయం.
సొత్తుకు అంగీకరించి....
సాధారణంగా మాయావతి పొత్తులకు అంగీకరించరు. ఎన్నికల అనంతరం పొత్తులకే ఆమె మొగ్గు చూపుతారన్నది అందరికీ తెలిసిందే. 2007 లో మాయావతి సొంతంగా విజయం సాధించినా ఆ తర్వాత మాత్రం బలహీన పడుతూ వచ్చారు. మాయావతి నియంత పోకడలే ఇందుకు కారణమన్న విమర్శలు కూడా అప్పట్లో విన్పించాయి. ఎన్నికల అనంతరం పొత్తు పెట్టుకోవడమే ఆమెకు ఇష్టం. అయితే నిన్న యూపీలో జరిగిన రెండు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమావజ్ వాదీ పార్టీకి మాయావతి బేషరతుగా మద్దతిచ్చారు. 25 ఏళ్ల అనంతరం మాయా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో యూపీ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయంటున్నారు.
ఎస్పీతో అవగాహన.....
మాయావతి 2019 లోక్ సభ ఎన్నికల్లో సయితం సమాజ్ వాదీ పార్టీతో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మోడీ హవాను కొంత తగ్గించాలంటే ఇద్దరూ కలవక తప్పని పరిస్థితి. ప్రస్తుతం జరిగినలోక్ సభ ఎన్నికల్లో ఈ స్కీమ్ వర్క్ అవుట్ అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు పర్చాలని యోచిస్తున్నారు. అయితే ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీతో మాయావతి ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీకి మద్దతివ్వాలని ఆమె చేసిన ప్రతిపాదనకు సమాజ్ వాదీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప వీరి స్కీమ్ వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియదు.