తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాయం అయిన పసిబిడ్డ ఎట్టకేలకు దొరికింది. గత మూడు రోజులుగా పోలీస్ యంత్రాంగం తీవ్ర స్థాయిలో చేసిన కృషి ఫలించి రోజుల వయస్సు వున్న చిన్నారి తల్లి ఒడి క్షేమం గా చేరుకోవడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ కేసులో సిసి కెమెరాలు కీలక భూమిక పోషించడంతో సున్నితమైన ఈ కేసు పరిష్కారం సులువు అయ్యింది. బిడ్డలు లేని ఒక మాజీ నర్స్ ఈ ఘాతుకానికి పాల్పడటం విశేషం బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళను అరెస్ట్ చేసి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ విశాల్ గున్ని లు పాపను తల్లి ఒడి చేర్చారు. దాంతో పోలీస్ రెవెన్యూ వర్గాలతో పాటు ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ఆసుపత్రుల్లో కరువైన భద్రత...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో శిశువుల మాయం రొటీన్ గా మారిపోయింది. ఆసుపత్రుల్లో నిఘా కోసం ఏర్పాటు చేసే సిసి కెమెరాలు పనిచేయకపోవడం సర్వ సాధారణమే అయ్యింది. ఈ సిసి కెమెరాల బాధ్యత చూసే వారికి పలుచోట్ల జీతాలు ఇవ్వకపోవడంతో కెమెరాలు పనిచేయడం ఆగిపోతున్నాయి. కాకినాడలోని ఆదే జరిగింది. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సిసి కెమెరాలు నిర్వహించే వ్యక్తికి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దాంతో కడుపుమండిన కాంట్రాక్టర్ తమ విధులను నిలిపేశాడు. ఫలితంగా శిశువు మాయం కేసులో అనేక విభాగాల్లో అమర్చిన సిసి కెమెరాలు పనిచేయక కీలక సమాచారం పోలీసులకు లభ్యం కాక పసిబిడ్డలు కన్నతల్లులకు దూరం అయిపోతున్నారు. కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ సిసి కెమెరాల నిర్వహణ కాంట్రాక్టర్ కి నిధులు చెల్లించాలిసి వుంది. చిన్న చిన్న నిర్లక్ష్యాలు భారీ మూల్యానికి దారి తీస్తున్నాయి. ఇప్పటికైనా నిద్రపోతున్న యంత్రాగం మేల్కొని ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతను మరింత కఠినతరం చేయాలిసి వుంది.