నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పై బీజేపీ మాటల దాడులు ఆపడం లేదు. ఇటీవల జరిగిన త్రిపుర ఎన్నికల్లో ఇరవై అయిదేళ్లు అప్రతిహతంగా పాలించిన వామపక్ష పార్టీ ప్రభుత్వం కుప్ప కూలిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టుల స్థానంలో కమలం పార్టీ వచ్చింది. ఎన్నికల ఫలితాలు రాగానే త్రిపురలో లెనిన్ విగ్రహం కూల్చివేతతో రెండు పార్టీల మధ్య ఉద్రికత్తలు నెలకొన్న సంగతి తెలిసిందే.
సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయాలంటూ....
అయితే త్రిపుర ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణస్వీకారోత్సవానికి మాణిక్ సర్కార్ ని ఆహ్వానించారు. ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. అయితే తాజాగా బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవ్ ధర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం కల్గిస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన అధికార గృహాల్లో సెప్టిక్ ట్యాంకులన్నింటినీ క్లీన్ చేయించాలని దేవ్ ధర్ వ్యాఖ్యానించారు. అన్ని ట్యాంక్ లను క్లీన్ చేసిన తర్వాతనే అధికారిక నివాసాల్లోకి వెళ్లాలని దేవ్ ధర్ బీజేపీ మంత్రులకు సూచించారు.
సెప్టిక్ ట్యాంకులో అస్తిపంజరం....
అయితే దేవ్ ధర్ వ్యాఖ్యలకు కారణం కూడా లేకపోలేదు. 2005 జనవరి 4వ తేదీన మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధికారిక నివాసంలోని సెప్టిక్ ట్యాంకులో మహిళ అస్తిపంజరం దొరికింది. ఈ అస్తిపంజరం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి సీఎంగా ఉన్న మాణిక్ సర్కార్ ఇంట్లో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేయడానికి వచ్చిన మున్సిపల్ సిబ్బంది ఆ అస్తిపంజరాన్ని గుర్తించారు. అయితే అప్పట్లోనే మాణిక్ సర్కార్ ఈ కేసును సీఐడీకి అప్పగించారు.
మళ్లీ వెలికి తీసే ప్రయత్నమా?
13 ఏళ్లవుతున్నా ఈ కేసు మిస్టరీ వీడలేదు. అయితే ఈ అస్తిపంజరం నేపాల్ కు చెందిన మహిళగా త్రిపురలో ప్రచారం ఉంది. నేపాల్ కు చెందిన యువతి సీఎం ఇంట్లో పనిచేసేది. అయితే సీఎం నివాసంలో ఉన్న సిబ్బంది ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే వెంటనే మృతురాలి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం నేపాల్ ను పంపించి వేసి కేసును తొక్కి పెట్టి ఉంచిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అస్తిపంజరం వ్యవహారాన్ని దేవ్ ధర్ ప్రస్తావించడంతో మరోసారి ఈ కేసును బీజేపీ సర్కార్ వెలికితీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.