ఇప్పడు తెలంగాణాలో దొంగలెవరు, దొరలెవరో ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా కాదు బాంబుల్లాగే పేలుతున్నాయి. ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. దాంతో రెండు పార్టీలు మీరు దొంగలంటే మీరు గజదొంగలని విమర్శలు ఆరోపణల తీవ్రత పెంచుతూ పోతున్నారు. ఏ ఒక్కరు వెనక్కి తగ్గడంలేదు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ పై ఆరోపణలు నేరుగా సంధించని కేసీఆర్ ఇప్పుడు ఆయన్ను టార్గెట్ చేశారు. అటు ఆయన తనయుడు కేటీఆర్ జోరు పెంచారు. వీరిద్దరికి కౌంటర్ గా ఉత్తమకుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు సవాళ్ళు విసురుతున్నారు. ఇక బిజెపి నేతలు ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్ తమదైన శైలిలో కేసీఆర్ టీం పై విరుచుకుపడుతున్నారు.
రాబోయే కురుక్షేత్రానికి...
మంత్రి కేటీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ కు 106 సీట్లు వస్తే తాను తన కుటుంబం రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటామని మరోసారి సవాల్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, తన సవాల్ కేటీఆర్ స్వీకరించి టి సర్కార్ రాకపోతే ఆయనేమి చేస్తారో చెప్పాలన్నారు. బస్సు యాత్రలో సర్కార్ పై టి కాంగ్రెస్ నేతలు నిత్యం విమర్శల వర్షాన్నే కురిపిస్తున్నారు.
జనాబాబా 40 దొంగలు ...
కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గొంటున్న ప్రతివారు ఏదో ఒక కేసులో వున్నారని జానా బాబా 40 దొంగల మాదిరి వారు ప్రజలను మోసం చేయడానికి మరోసారి తయారయ్యారంటూ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. ఒకరు ఓటుకు నోటు కేసులో దొంగ అయితే మరొకరు 3 కోట్ల రూపాయలు తో అడ్డంగా దొరికిపోయారని వీరందరిపై ఏదో ఒక కేసులో ఉన్నారన్నారు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ కు ఒక్కరూపాయి ఇవ్వనన్నప్పుడు కానీ, చిత్తూరు జిల్లాకు 9 వేలకోట్ల రూపాయలను కిరణ్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ దొంగలంతా ఆయనకు వత్తాసుపలికారని విమర్శించారు. నల్గొండ వంటి ఫ్లోరోసిస్ ప్రాంతానికి నిధులు, నీళ్లు ఇవ్వకుండా ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసినా ఏ ఒక్కరు నోరెత్తలేదని ఫైర్ అయ్యారు కేటీఆర్.
ప్రధాని చుట్టూ 20 సార్లు తిరిగా ....
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని మంత్రి చుట్టూ 20 సార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని విమర్శల దాడి ప్రారంభించారు కేసీఆర్. విభజన హామీలు అమలుకు రైల్వే జోన్, బయ్యారం స్టిల్ ఫ్యాక్టరీ, హై కోర్ట్ విభజన తదితర అంశాలపై ప్రధానికి, అరుణ్ జైట్లీకి ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులకు చెప్పినా లాభం లేకపోయిందని కేసీఆర్ వాపోయారు.
కౌంటర్ ఇచ్చిన బిజెపి ....
ప్రధాని వంటి వ్యక్తికి సైతం కనీస గౌరవం ఇవ్వకుండా వాడు వీడు అంటూ కేసీఆర్ సంభోదిస్తున్న తీరును బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యక్తి మాకు ముఖ్యమంత్రి గా ఉన్నారా ? అంటూ తెలంగాణ సమాజం నివ్వెరపోతుందని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ విమర్శల వర్షం కురిపించారు. ఇలా తెలంగాణాలో జోరుగా నడుస్తున్న రాజకీయాలు రోజుకో చర్చను రచ్చను మిగులుస్తున్నాయి.